అక్రమ వెంచర్లపై అధికారులు కొరడా…

– అయోమయంలో వెంచర్‌ అధికారులు రియల్‌ వ్యాపారులు..
– ముడుపులు ముట్టజేప్పినా వారి వైపు కన్నెత్తి చూడని ఎంపీఓ, పౖౖె అధికారులు..
– సురభి వెంచర్‌ను ఎందుకు పట్టించుకోలేదు
నవతెలంగాణ-మొయినాబాద్‌
మండల కేంద్రంలో అక్రమంగా వెలిసిన వెంచర్‌పై అధికారులు కొరడా ఝులిపించారు.111 జీఓకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవ సాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించిన వారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అధికారులు నోటీసులు అందించిన యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుండటంతో మరో మారు అధికారులు ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. బుధవారం మండల కేంద్రంలోని హిమాయత్‌ నగర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 145లో అక్రమంగా వెలిసిన వెంచర్‌పై మండల ఎంపీఓ వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంధ్య, గ్రామపంచాయతీ పాలకవర్గంతో సహా ప్రవేశించి వెంచర్‌ను జేసీబీ సహాయంతో అక్రమ ప్రికాస్ట్‌ గోడలను నెల మట్టం చేశారు. దాంతో వెంచర్‌ యాజమాన్యం కూల్చివేతను ఆపాలని అడ్డగించినా ఫలితం లేకుండా పోయింది. పైనుంచి ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలిపారు. దాంతో వెంచర్స్‌ యాజమాన్యులు రియల్‌ వ్యాపారులలో తెలియని అయోమయంతో పాటు గుబులు షురువైందని పలువురు చర్చించు కుంటున్నారు. కొందరు మాత్రం కూల్చివేతలను వ్యతిరేకిస్తూ మండలంలో ఇది ఒక వెంచరే కాదు కదా బీజాపూర్‌ హైదరాబాద్‌ హైవేకు ఆనుకుని రోడ్లు, రంగురంగుల సైడ్‌ వాల్‌లతో అలంకరించిన సూరభి వెంచర్‌ కథేంటని ఎంపిఓను ప్రశ్నించారు. ఈ వెంచర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి కనుచూపుమేరలో ఉన్న సురభి వెంచర్‌ను ఎందుకు పట్టించుకోదని పలువురు నిలదీశారు. అంటే ముడుపులు ముట్టజేప్పిన వాటిపై ఎంపీఓ మీరు కన్నెత్తి చూడరా అని ప్రశ్నించారు . వీటిపై తీసుకున్న చర్యలే మిగతా వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కొందరు ఎంపీఓను కోరారు.

Spread the love