నవతెలంగాణ – ఉత్తర ప్రదేశ్ : నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిపైకి ఎస్‌యూవీకారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్టార్ 78లోని మహాగున్ మోడ్రన్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణ నారంగ్ (75) అనే వృద్ధురాలు గురువారం సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళ్లింది. ఆమె వాకింగ్ చేస్తున్న సమయంలో బేస్‌మెంట్ నుంచి వచ్చిన ఓ కారు ప్రమాదవశాత్తు కృష్ణ నారంగ్‌ను డీ కొట్టింది. దీంతో ఆ వృద్ధురాలు కారు చక్రాలకింద నలిగిపోయి తీవ్ర గాయాలపాలైంది. అనంతరం బాధితురాలిని కారు డ్రైవర్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరీష్ చంద్ర తెలిపారు. దర్యాప్తు అనంతరం డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.