నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ కో హఠావో.. దేశ్ కో బచావో పేరుతో నెల రోజులపాటు నిర్వహించిన ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ నెల 11న కొత్తగూడెంలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. సీపీఐ ప్రజా గర్జన పేరుతో కొత్తగూడెంలోని ప్రకాశం గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ సభలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాల కొనసాగింపు, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణను ప్రకటించనుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, పోరాటాలకు సంబంధించి నాయకులు దిశా నిర్దేశం చేస్తారన్నారు. ఈ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, కార్యదర్శులు కే నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, నాయకులు చాడా వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదతరులు హాజరవుతారని వెల్లడించారు.