– 14 వేల మంది పిల్లలతో విద్యాదినోత్సవం
– ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్బంగా ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. దాదాపు 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో విద్యాదినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది కాలంలో విద్యార్థుల కోసం చేసిన గణనీయమైన మార్పులు, డైట్ చార్జీల పెంపు, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆమె గుర్తుచేశారు. ఎల్బీ స్టేడియంలో ఈనెల 14న నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు శ్రీధర్, బుర్రా వెంకటేశం, కార్యదర్శి శరత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్బంగా ఈనెల 14 నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు 26 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారని గుర్తుచేశారు.ఈ ఉత్సవాలలో మొదటి రోజైన 14న ప్రభుత్వ, గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని వివరించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులతో మోడల్ అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, ఈ ఏడాది కాలంలో విద్యాశాఖలో వచ్చిన గణనీయ మార్పులు, అభివృద్ధిపై ఏవీ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. విద్యాశాఖపై ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్‌ను సీఎం ఆవిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి విద్యార్థులు హాజరవుతారని వివరించారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎండా, వానలకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా షామియానాలు, నిరంతర విద్యుత్ సరఫరా, హాజరయ్యే విద్యార్థులకు కనీస సౌకర్యాల కల్పన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదిక నిర్మాణం తదితర ఏర్పాట్లను చేపట్టాలని చెప్పారు.