నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 20 వ తేదీన నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. పూజల అనంతరం అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన భక్తుల నూతన క్యూ లైన్ ను, రుద్రాక్ష మండపం నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. గత సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని 8 లక్షల మంది భక్తులు తిలకించారని వెల్లడించారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 20 వ తేదీన జరిగే అమ్మవారి కళ్యాణానికి, 21 వ తేదీన నిర్వహించే రథోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన బారికేడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.