నవతెలంగాణ – హైదరాబాద్
ఈ నెల 21న హైదరాబాద్‌లో రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహబూద్ అలీ, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్ రెండో దశలో దాదాపు 13,300 ఇండ్లను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా పేదలకు మాత్రమే అందిస్తున్నామని.. డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదన్నారు. లబ్ధిదారులను ఎంపికను ప్రభుత్వ అధికారులకే అప్పగించామని, లబ్ధిదారుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పథకంలో భాగంగా ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.