– బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పిటిషన్ విచారణ వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని, దర్యాప్తు సంస్థలు మహిళలను వారి ఇం ట్లోనే విచారించాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారిం చింది. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం భార్య నళిని చిదంబరం, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌బెనర్జీల పిటిషన్‌లతో కలిపి కవిత పిటిషన్ ధర్మాసనం ముందుకొచ్చింది. ఇతర కేసుల విచారణ వల్ల సమయం లేకపోవడంతో శుక్రవారం కవిత పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.
బీఆర్‌ఎస్ ఎంపీ బిబి పాటిల్ పిటిషన్ కొట్టివేత
ఎన్నికల అఫిడవిట్‌కు సంబంధించిన జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి గెలుపొందిన బీబీ పాటిల్ (బీఆర్‌ఎస్) తన ఎన్నికల అఫిడవిట్‌లో కేసుల వివరాలు దాచారని, అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొనగా దాన్ని సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధరా మసనం విచారించి ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది. బీబీ పాటిల్ అభ్యర్థనను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
మార్గదర్శి కేసు విచారణ ఆగస్టు 4కి వాయిదా
మార్గదర్శి కేసు విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో చిట్స్ (చందాదారుల) మొత్తాన్ని హైదరాబాద్‌కు నిబంధనలకు విరుద్ధంగా తరలించారని ఆరోపిస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీపై ఏపి ప్రభుత్వం ఏడు కేసులు నమోదు చేసింది. దీని మర్గదర్శి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. తెలంగాణ హైకోర్టు విచారించే పరిధి ఉందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సిటి రవి కుమార్, జస్టిస్ సంజరు కుమార్ ధర్మాసనం విచారించింది. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులపై విచారణ ఆంధ్రప్రదేశ్ పరిధిలోనిదని, తెలంగాణ హైకోర్టు పరిధిలోకి రాదని ఏపి ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదించారు. ఎఫ్‌ఐఆర్ ఎక్కడ నమోదైన విచారణ ఎక్కడైన చేయొచ్చని, ఈ విషయాన్ని 40 ఏళ్ల క్రితమే సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరిపారో, ఆ హైకోర్టు పరిధిలోకే కేసుల విచారణ వస్తుందని తెలిపారు. ఏపీలో చిట్స్ (చందాలు) హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి తరలించి, అక్కడ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని ఏపి ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విచారణకు సహకరిస్తున్నామని, ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తే అందులో మూడు, నాలుగు చార్జిషీట్‌లు దాఖలు చేశారని మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది తెలిపారు. అయితే సుప్రీం కోర్టు ధర్మాసనం జోక్యం చేసుకొని గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్లతో కలిపి విచారిస్తామని పేర్కొంటూ కేసు తదుపరి విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసింది.