– సుద్దాల హనుమంతు సాహిత్యం-జీవితం సమగ్ర పుస్తకావిష్కరణ
– సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ
– ముఖ్య అతిథులుగా సురవరం సుధాకర్‌రెడ్డి, బీవీ రాఘవులు
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5గంటలకు
నవతెలంగాణ – హైదరాబాద్
సుద్దాల హనుమంతు ప్రజాపాట సభను హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 16న నిర్వహించనున్నట్టు టీపీఎస్‌కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి తెలిపారు. ఆ సభకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆ సభలో ‘ప్రజాపాటకు పరిపరి దండాలు’ పేరుతో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ముద్రించిన ప్రజాకవి సుద్దాల హనుమంతు సాహిత్యం-జీవితం, సమగ్ర రచన పుస్తకావిష్కరణ ఉంటుందనీ, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రముఖ సినీనటులు ఉత్తేజ్, విమలక్క, ప్రముఖ కవి కోయి కోటేశ్వరరావు, సినీ పాటల రచయిత, కవి సుద్దాల అశోక్‌తేజ, ఎస్‌వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్ హాజరవుతారని తెలిపారు. అరసం, తెలంగాణ సాహితి, ప్రజానాట్యమండలి, తెలంగాణ ప్రజానాట్యమండలి, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కళారూపాలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఆ సభను జయప్రదం చేయాలని కోరారు. పోస్టరావిష్కరణలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.