కవితపై దాఖలైన చార్జిషీట్‌పై పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 29న వెల్లడిస్తాం

కవితపై దాఖలైన చార్జిషీట్‌పై పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 29న వెల్లడిస్తాం– లిక్కర్‌ స్కాంలో కవితతో పాటు, మరో నలుగురి పాత్రను కోర్టుకు వివరించిన ఈడీ
– హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్లు ఆరోపణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని ఈనెల 29న వెల్లడిస్తామని రౌస్‌ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10న కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై దాదాపు 200 పేజీల ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు (చార్జిషీట్‌)ను ఈడీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌, సెక్షన్‌ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ చార్జిషీట్‌ డాక్యుమెంట్స్‌ను ట్రంకుపెట్టెలో కోర్టుకు సమర్పించింది. ఎమ్మెల్సీ కవిత, ఆప్‌ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌) దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, చరణ్‌ ప్రీత్‌ సింగ్‌, ఇండియా ఎహెడ్‌ న్యూస్‌ ఛానల్‌ మాజీ ఉద్యోగి అరవింద్‌ సింగ్‌ను తాజా చార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొంది. ఈ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొవాలనే అంశంపై మంగళవారం ఈడీ తరపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌ కె మట్ట వాదనలు వినిపించారు. సోమవారం స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా అడిగిన పలు వివరాలతో పాటు, దామోదర్‌ శర్శ, అరవింద్‌ కుమార్‌, ఇతర నిందితుల పాత్రను కోర్టును నివేదించారు. లిక్కర్‌ స్కాంలో కవిత కింగ్‌ పిన్‌గా వ్యవహరించారని అప్రూవర్లు శరత్‌ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శ్రీనివాస్‌ ఇచ్చిన వాంగ్మూలాలను ప్రస్తావించారు. అలాగే హవాలా రూపంలో డబ్బులు మళ్లించడంలో ఇండియా ఎహెడ్‌ న్యూస్‌ ఛానల్‌ మాజీ ఉద్యోగి అరవింద్‌సింగ్‌ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. అలాగే దామోదర్‌ శర్మ సైతం అక్రమ మార్గంలో నగదు బదిలీలో పాల్గొన్నారని కోర్టు దృ ష్టికి తెచ్చారు. దాదాపు రూ. 50 లక్షలను వీరు హవాలా రూంలో మళ్లించారని, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఆయా నిబంధనల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు కోర్టుకు నివేదించారు. ఆధారాలు, ఫోన్‌ డేటా, కాల్స్‌, ఇతర ఎవిడెన్స్‌తో దాఖలు చేసిన 8 వేల పేజీల చార్జిషీట్‌ ను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ వాదనలు ముగించారు. ఈడీ తరపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా, చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై తీర్పును ఈనెల 29కి రిజర్వ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love