ఓవైపు ఉక్కపోత..మరోవైపు వడదెబ్బ..

On one side, the steel is falling.. on the other side, sunburn..– 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
– మరో రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశం
– హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
– ఎండకు తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు
– పలు జిల్లాల్లో కురిసిన వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడ పగలగొట్టేస్తున్నాడు. ఎండ దెబ్బకు ఓ పక్క వడగాల్పులు..మరోపక్క తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నా…కూలర్ల మోత మోగుతున్నా వేడిగాల్పే వస్తున్నది. ఎన్ని నీళ్లు తాగినా గొంతు తడారట్లేదు. గాలిలో తేమ శాతం వేగంగా పడిపోతుండటంతో డీహైడ్రేషన్‌కు గురై నీరసపడిపోతున్నారు. రాష్ట్రంలో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం గమనార్హం. వచ్చే మూడు రోజులు కూడా ఎండలు దంచికొట్టే అవకాశముంది. రాష్ట్రంలో ఇప్పుడు నమోదవుతున్న దానికంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. వడగాల్పులు వీచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వడగాల్పులు వీచే జాబితాలో కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాలున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశముంది. అయితే, ఆయా జిల్లాల్లో ఒకటెండ్రు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. బుధవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌ జిల్లా రెబ్బనలో అత్యధికంగా 4.03 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారంలో 2.65 సెంటీమీటర్ల వర్షం పడింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
నిడమనూరు(నల్లగొండ) 44.8 డిగ్రీలు
నల్లగొండ 44.7 డిగ్రీలు
నాంపల్లి(నల్లగొండ) 44.7 డిగ్రీలు
అయ్యగారిపల్లి(మహబూబాబాద్‌) 44.7 డిగ్రీలు
మునగాల(సూర్యాపేట) 44.7 డిగ్రీలు
గార్ల (మహబూబాబాద్‌) 44.7 డిగ్రీలు
అశ్వరావుపేట(భద్రాద్రి కొత్తగూడెం) 44.7 డిగ్రీలు
తిమ్మాపూర్‌(నల్లగొండ) 44.6 డిగ్రీలు
మరిపెడ(మహబూబాబాద్‌) 44.5 డిగ్రీలు
వెంకటాపురం(ములుగు) 44.5 డిగ్రీలు

Spread the love