నవతెలంగాణ-హైదరాబాద్ : బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత తర్వాత నాగార్జున సాగర్ కుడి కాల్వ వద్ద గురువారం మరోసారి ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఇంకా అక్కడే ఉండడం ఇందుకు కారణమైంది. ఏపీ పోలీసులు బుధవారం రాత్రి నుంచి అక్కడే ఉండడంతో తెలంగాణ పోలీసులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదిలావుండగా ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై బుధవారం అర్ధరాత్రి దాదాపు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అయితే డ్యామ్ ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసులపై వారిపై దాడి చేశారు. 13వ గేట్ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులను అడ్డుకున్న డ్యామ్ సిబ్బంది మొబైల్ ఫోన్లు లాక్కుతున్నారు. అంతేకాకుండా డ్యామ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ వద్దకు చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడినా వెనక్కి తగ్గలేదనే విషయం తెలిసిందే.