ఫ్రాన్స్‌ కాల్పులు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక వివాహ వేడుకలో పలువురు దుండగులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఫ్రాన్స్‌లోని ఈశాన్య నగరమైన థియోన్‌విల్లేలో ఆదివారం ఉదయం 1.15 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తుంది. వివాహ సమయంలో దాదాపు వంద మంది వరకు అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది సిగిరేట్ కాల్చడానికి రిసెప్షన్ హాల్‌ ముందు నిలబడి ఉన్న సమయంలో ఒక కారులో వచ్చిన మాస్కులు ధరించి ఉన్న ముగ్గురు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వివాహ వేడుకలో తీవ్ర అలజడి రేగింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆకస్మాత్తుగా జరిగిన ఘటనతో అందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలై ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ దాడి ఎవరు, ఎందుకు చేశారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన గొడవల కారణంగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు తీసుకొచ్చిన కారు వివరాలు కూడా స్పష్టంగా లేవు. ఈ వివాహ వేడుకను లక్ష్యంగా చేసుకుని, వారు ఈ కాల్పులకు పాల్పడలేదని, పెళ్లికి హాజరైన కొంతమంది లక్ష్యంగా నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love