నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. నిందితులైన ముగ్గురు యువకులు మరో చోట కూడా ఒక వ్యక్తి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈశాన్య ఢిల్లీలోని కబీర్ నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తున్న నదీమ్, అతడి ఇద్దరు స్నేహితులపై బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత నదీమ్ స్కూటర్, మొబైల్ ఫోన్ తీసుకుని పారిపోయారు. వారి బైక్‌ను అక్కడ వదిలేశారు. కాగా, ఈ కాల్పుల సంఘటనలో నదీమ్ మరణించాడు. అతడి ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన ముగ్గురు మైనర్ బాలురను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరు నదీమ్ నుంచి అప్పు తీసుకున్నాడని, తిరిగి చెల్లించడంపై ఒత్తిడి చేయడంతో కాల్చి చంపారని వెల్లడించారు. మరోవైపు ఈ ముగ్గురు యువకులు అదే రాత్రి వేళ జ్యోతి నగర్‌లో కూడా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. రాహుల్ అనే వ్యక్తి ఇంటి బయట ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన వారి నుంచి మూడు కంట్రీ మేడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు కాల్పుల సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వివరించారు.