విద్యుత్ షాక్ తో ఒకరి మృతి…

– ఇద్దరికీ ఎల్ సి ఇచ్చిన తర్వాత ఘటన..
– లైన్ మేన్ నిర్లక్ష్యమే కారణం.. బంధువుల ఆరోపణ..
– తండాలో విషాదం..
నవతెలంగాణ-డిచ్ పల్లి
విద్యుత్ శాఖ అధికారి నిర్లక్ష్యంతో ఒకరి ప్రాణాం గాల్లో కలిసింది. ఈ సంఘటన మంగళవారం ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంజిత్ నాయక్ తండా గ్రామ పంచాయతీలోని స్కూల్ తాండలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్ వాయి సబ్ స్టేషన్ పరిధిలోని పంట పొలాల వద్ద ఈదురు గాలులు ఇతర కారణాలతో విద్యుత్కు సంబంధించిన పనులు చేయడానికి ఇందల్ వాయి గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్ నాగరాజ్ ప్రైవేట్ వ్యక్తులచే పనులను చేయించాడానికి సబ్ స్టేషన్ లో ఫోన్ చేసి ఎల్ సి లైన్ క్లియర్ తీసుకున్నారు. చంద్రాయన్ పల్లి మాజీ సర్పంచ్ పాల్త్య కిషన్ తమ్ముడు పాల్త్య బాబురావు 43 తన ఇంటి వద్ద సర్వీస్ వైర్ బాగు చేసుకోవడానికి లైన్మెన్ నాగరాజ్ కు ఫోన్ చేసి ఎల్ సి ఇవ్వాలని కోరగా ప్రైవేటు వ్యక్తి, బాబురావు వేర్వేరు చోట్ల పనులు చేస్తుండడంతో ఇందల్ వాయి సబ్ స్టేషన్ లో ఆపరేటర్కు ఫోన్ చేసి ఎల్ సి తీసుకున్నారు. కాని ప్రైవేట్ వ్యక్తుల పనులు పూర్తికాగానే వారు లైన్మెన్ నాగరాజుకు ఫోన్ చేసి పనులు పూర్తయ్యాయని చెప్పిన వెంటనే విద్యుత్ ను పునరుద్ధరించారు. ఇంకో వ్యక్తి బాబురావు కు సైతం లైన్ ఇచ్చిన విషయం లైన్ మేన్ కు గుర్తుకు రాక ఆపరేటర్ కు ఫోన్ చేసి విద్యుత్ ను పునరుద్ధరించారు. అప్పటికే బాబురావు ఇంటివద్ద సర్వీస్ వైర్ చేతిలో పట్టుకొని మరమ్మతులు చేస్తుండగానే ఒకేసారి విద్యుత్ రావడంతో షాక్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోవడంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం  ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకొని రాగా పరిస్థితి విషమంగా ఉండడంతో వారు జిల్లా కేంద్రానికి తీసుకొని వెళ్లాలని సూచించగా నిజామాబాద్ కు తరలించారు. ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ కు చేరుకొని లైన్మెన్ నాగరాజ్ నిర్లక్ష్యంతో బాబురావు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురికి తరలించారు. మృతుడికి భార్య గంగుబాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న తాండవాసులు, ఇతర గ్రామాల ప్రజలు తండాకు చేరుకొని బోరున విలపించారు అందరితో కలిసిమెలిసి ఉండే బాబురావు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో తాండలో విషాదఛాయలు అలుము కున్నాయి.

Spread the love