నవతెలంగాణ – హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయమే కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ మొదలైన గంట తర్వాత అరుణాచల్‌లో బీజేపీ 8 స్థానాల్లో, దాని మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా 4 స్థానాల్లో, బీజేపీ ఒక చోట, ప్రతిపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అవడంతో రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకుగానూ నేడు 50 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఉన్నారు. మిగతావారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఇటానగర్ నుండి టెకీ కాసో, తాలిహా నుండి న్యాతో దుకమ్, రోయింగ్ నుంచి ముచ్చు మితితో పాటు పలువురు ఉన్నారు. 2019లో 41 సీట్లు గెలుచుకున్న బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో తమ అభ్యర్థులను ఇక్కడ బరిలో నిలిపింది.