బీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌ మిగిలింది 98 రోజులే…

Countdown to BRS Only 98 days left...– కారు, కమలం, కైట్‌ ముసుగు తొలగిపోయింది
– భారతమాత గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు
– మెరుగైన ధరణిని తెస్తాం
– సీడబ్య్లూసీ సమావేశాలను జయప్రదం చేసిన నేతలకు ధన్యవాదాలు : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పాలనకు ఇంకా 98రోజులే మిగిలి ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ విజయభేరి సభ జయప్రదం కావడాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు తట్టులేకపోతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ తల్లి సోనియమ్మను స్వాగతించాల్సింది పోయి…బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించడం సిగ్గుచేటన్నారు. వారు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహురూపుల వేషాలు వేస్తూ విజయభేరి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రానికి రావడంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీల ముసుగులు తొలగిపోయాయనీ, కారు, కమలం, కైట్‌ వేర్వేరు కాదనీ, అవి ఒక్కటేనని తెలిపోయిందన్నారు. సోమ వారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్‌, అంజన్‌కుమార్‌యాదవ్‌, మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ,
మాజీ ఎమ్మెల్యే నందికంటి శ్రీధర్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ ప్రజల నినాదాలు కాదనీ, అవి కేసీఆర్‌ నినాదాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మ గౌరవమని వివరించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చింతకు ఉరేసుకొని సచ్చినా ధరణి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఏంలాగా మారిందన్నారు. రాష్ట్రంలో భూసమస్య ప్రధానమైనదన్నారు. భూమి కోసమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దేశం గురించి బీజేపీకేం తెలుసని ప్రశ్నించారు. మత విద్వేషాలతో రాజకీయాలు చేసే బీజేపీకి భరతమాత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఉద్యమకారులకు భూమి ఇవ్వడమంటే వారిని గుర్తించి గౌరవించడమేనన్నారు. బండి సంజరు, రాజ్‌గోపాల్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి లేవనెత్తిన అంశాలపై బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం తథ్యమని ఆదివారం నాటి విజయభేరి సభలో తేల్చి చెప్పిందన్నారు. కాంగ్రెస్‌ గ్యారంటీలతో బీఆర్‌ఎస్‌ నేతలు కకావి కలమవుతున్నారని ఎద్దేవా చేశారు. మేం ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ వారివద్దకు వెళతామన్నారు. గతంలో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్‌ నెరవేర్చిందన్నారు. ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పోడు భూముల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసి చూపించామని గుర్తు చేశారు. ‘నల్లధనం తెస్తామనీ, ఉద్యోగాలు ఇస్తామని మోడీ మోసం చేశారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు అంటూ కేసీఆర్‌ మోసం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టండి. ఎవరు మాట తప్పారో? ఎవరు అమలు చేశారో? తెలుస్తుంది’ అని సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ప్రజల అవసరాలకనుగుణం గానే తమ పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ వస్తే జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావు మొండి వాదనలు చేస్తున్నారని విమర్శించారు. సీడబ్య్లూసీ సమావేశాలను విజయవంతం చేసిన జాతీయ, రాష్ట్ర నాయకులకు రేవంత్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love