2050లో నీటి సంక్షోభం : ఎఫ్‌టీసీసీఐ పర్యావరణ కమిటీ చైర్మెన్ బాల సుబ్రమణ్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూమిలో లభించే నీటిలో ఒక శాతం మాత్రమే తాగునీరు ఉందని ఆస్కీ ప్రొఫెసర్, ఎఫ్‌టీసీసీఐ పర్యావరణ కమిటీ చైర్మెన్ జి.బాలసుబ్రమణ్యం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగింటిలో ఒక వంతు నీటిని భారతదేశమే వినియోగించుకుంటుందని అన్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐలో ‘పరిశ్రమ కోసం నీటి భద్రత, సుస్థిరత విధానం’ అంశంపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నీటి వినియోగాన్ని రీడిజైన్ చేయాలని అన్నారు. భారతదేశం ప్రపంచ జనాభాలో 17 శాతానికిపైగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే భూగర్భ జలాలలో నాలుగో వంతును వినియోగిస్తున్నామని తెలిపారు. ఇది అమెరికా, చైనా రెండు దేశాల వినియోగం కంటే ఎక్కువ అని ఆయన తెలిపారు. నిటి అయోగ్ నివేదిక ప్రకారం 2050 నాటికి నీటి సంక్షోభం కారణంగా భారతదేశం జీడీపీలో 6శాతం నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని విశ్లేషించారు. 2030 నాటికి, నీటి డిమాండ్ అందుబాటులో ఉన్న సరఫరా కంటే రెండింతలు ఉంటుందని అంచనా వేశారని అన్నారు. అంతకుముందు ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్‌అగర్వాల్ తన ప్రారంభోపన్యాసం చేస్తూ పారిశ్రామిక రంగంలో నీరు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఉత్పత్తి సామర్థ్యం, లాభదాయకత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అనేక పరిశ్రమలకు నీటి కొరత ఒక ముఖ్యమైన సవాలుగా మారిందన్నారు. నీటి వినియోగం, నిర్వహణ పట్ల పరిశ్రమలు స్థిరమైన విధానాన్ని అవలంభించడం అత్యవసరమని అన్నారు.