మూడింట ఒక వంతుకే పట్టాలా..!

ఎన్ని ఎకరాలకు పోడు పట్టాలిస్తారనేదానిపై అయోమయం
– రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాల వరకు దరఖాస్తులు
– నాలుగు లక్షల ఎకరాలకు పైగా పట్టాలిస్తారని ప్రచారం
– శాటిలైట్‌ సర్వే ప్రామాణికంగా తీసుకోవడంపై అభ్యంతరాలు
– 11 లక్షల ఎకరాలకు పైగా పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్‌
– వచ్చేనెల 24 నుంచి పోడుపట్టాల పంపిణీ
         ‘ఏండ్లుగా పోడుభూముల్లో పంటలేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తం. వీటిని 2022 ఫిబ్రవరిలోనే అందిస్తం. సాగుదారులకు హక్కు కల్పిస్తం. ఇక నుంచి పోడుదారులకు ఫారెస్టు సిబ్బందికి తగువులుండవ్‌..’ అంటూ సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. ఏడాదికి పైగా ఆలస్యమైనా, ఈ ఏడాది జూన్‌ 24వ తేదీ నుంచి పోడుపట్టాల పంపిణీకి శ్రీకారం చుడతామని తాజాగా చేసిన ప్రకటన పోడుదారుల్లో సంతోషాన్ని నింపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల వరకు దరఖాస్తులు రాగా వీటిలో ఎన్ని ఎకరాలకు పట్టాలిస్తారనే అంశంపై సందేహాలు నెలకొన్నాయి.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోడు పట్టాలపై ప్రభుత్వ నిర్ణయం సంతోషం కలిగించినా, అవి అందరికా..కొందరికా అన్న అయోమయం కొనసాగుతోంది.శాటిలైట్‌ సర్వే ఆధారంగా పోడుభూములను నిర్ధారించడంతో నాలుగు లక్షల ఎకరాల్లోపు భూములకు మాత్రమే పట్టాలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో గిరిజనుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. మొత్తం 15 రకాల ఆధారాలను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉన్నా అశాస్త్రీయమైన శాటిలైట్‌ సర్వే ఆధారంగా పట్టాలను నిర్ధారణ చేయడం సరికాదని గిరజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వేలల్లో, లక్షల్లో దరఖాస్తులు వస్తే పదివేల ఎకరాలకే పట్టాలు సిద్ధమైనట్టు సమాచారం. వివిధ జిల్లాల్లో అందిన దరఖాస్తులు, సిద్ధమైన పట్టాలను పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది.
దరఖాస్తులు, పట్టాలకు పొంతన లేదు..
వివిధ జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులు, పంపిణీ చేయనున్న భూములకు పొంతనే లేదని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ, అటవీ, కమిటీ సభ్యులతో జిల్లాస్థాయి అటవీహక్కుల (డీఎల్‌సీ) సమావేశం నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు. జిల్లాలోని 332 గ్రామపంచాయతీల పరిధిలోని 726 హ్యాబిటేషన్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారుల్లో ఎస్టీలు 65,616 మంది, గిరిజనేతరులు 17,725 మంది ఉన్నారు. ఆర్‌ఏఎస్‌ఆర్‌ చట్టం ఆధారంగా ప్రతి హ్యాబిటేషన్లలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం, ఆయా కమిటీల సమావేశాల్లో చర్చించిన పిదప 50,595 మంది లబ్దిదారులకు సంబంధించి 1,51,195 ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 1,01,828 మంది 3,42,482 ఎకరాల హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేశారు. మొత్తం దరఖాస్తుదారుల్లో సగం మందికి లోపే లబ్ది చేకూరనుంది. ఖమ్మం జిల్లాలో 94 పంచాయతీల్లో సర్వే చేయగా 18,487 దరఖాస్తులు 43,193 ఎకరాలకు అందగా 5,857 మందికి 9,779 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి..
రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా హక్కుపత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా గిరిజనుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఎందరికి, ఎన్ని ఎకరాలకు పట్టాలు వస్తాయనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామపంచాయతీల నుంచి 11,55,849 ఎకరాలకు సంబంధించి 3,94,996 క్లైయిమ్‌లు వచ్చాయి. దీనిలో 7.19 లక్షల ఎకరాలకు 2.23 లక్షల క్లైయిమ్‌లు గిరిజనుల నుంచి వస్తే 4.36 లక్షల ఎకరాలకు 1.71 లక్షల మంది గిరిజనేతరుల నుంచి అందాయి. గ్రామ, మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో పరిశీలన అనంతరం దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు పైగా 1.55 లక్షల మంది గిరిజనులను గుర్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 55వేలు, ఆదిలాబాద్‌లో 33వేలు, వరంగల్‌లో 32వేలు, నిజామాబాద్‌లో 7,500, మహబూబ్‌నగర్‌లో 3,500, కరీంనగర్‌లో 3,450, నల్లగొండలో 2,800, మెదక్‌లో 2,800 మందికి పట్టాలిచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అందరికీ ఒకేసారి పట్టాలు ఇవ్వాలి
కారం పుల్లయ్య, భద్రాచలం నియోజకవర్గ సీపీఐ(ఎం) కో కన్వీనర్‌
విడతల వారీగా కాకుండా దరఖాస్తుదారులు.. ఎన్ని ఎకరాలకు దరఖాస్తు చేస్తే అన్ని ఎకరాలకు ఏకకాలంలో పట్టాలివ్వాలి. గిరిజనుల్లో ఇప్పటికే పట్టాల విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. ఎన్ని ఎకరాలకు పట్టాలిస్తారనే దానిలో స్పష్టత లేదు. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే మరోమారు ఉద్యమాలు తప్పవు.

Spread the love