కార్మికవర్గ ఐక్యతతోనే మతతత్వ విధానాల్ని తిప్పికొట్టగలం!

కేంద్ర బీజేపీ ఎత్తుగడలను ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత అమలు
కార్మికవర్గం సమిష్టిగా అడ్డుకోకపోతే కార్మికవర్గ ఐక్యత
విచ్ఛిన్నం అవుతుంది. కార్మికులు మరింత దోపిడీకి
గురవుతారు. దీన్ని ప్రతిఘటించేలా ఎక్కడికక్కడ
ఉద్యమాలు నిర్మించాలి. కార్మికుల కష్టాన్ని కార్పొ రేట్లకు
దోచిపెట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న విధానాలను
తీవ్రంగా వ్యతిరేకించాలి. అందుకు కార్మికులు మరింత
చైతన్యవంతంగా, సమరశీల పోరాటాలు
నిర్వహించేందుకు మే నెలంతా కూడా సీఐటీయూ
నిర్వహిస్తున్న క్యాంపె యిన్‌ను విజయవంతం చేయాలి.
అందుకు వాడవాడలా ప్రచారం చేయాలి. కార్మికుల్లో,
పని ప్రదేశంలో, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తీసుకెళ్లి
ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ప్రతిసారి మతతత్వ, కార్పొరేట్‌ శక్తుల అనుకూల విధానాల వల్ల కార్మికవర్గ ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం మనువాదాన్ని అమలు చేయడం కోసం కేంద్రంలో అధికారాన్ని దుర్వినియోగ పరుస్తున్నది. మోడీ 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ల పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టడం, రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను అవలంభించడం, దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రజల సమస్యలు, కార్మికవర్గ సమస్యలు పరిష్కరించకుండా వచ్చిన అసంతృప్తి, ప్రతిఘటనలను పక్కదారి పట్టించడం కోసం మతోన్మాదాన్ని ప్రోత్సహిం చడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ విధానాల వల్లనే కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదనేది నగసత్యం. వాటి వెనకాల పాలకవర్గాల రాజకీయ విధానాలు కీలకం. ఈ విషయం కార్మికులు అర్థం చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యం. దీంతోనే కార్మికవర్గ ఐక్యత సాధించి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ విధానాల్ని తిప్పికొట్టొచ్చు. కార్మికుల్లో చైతన్యాన్ని పెంచేందుకుగాను సీఐటీయూ బృహత్తరమైన కార్యక్రమాన్ని తన భుజాలమీద వేసుకున్నది. మే 1నుంచి దేశవ్యాప్తంగా క్యాంపెయిన్‌ చేపట్టింది. ఇది మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం వరకు కొనసాగుతుంది.
ప్రజల త్యాగాలతో 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషోడిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. భారతదేశ పరిపాలనకు దిక్సూచిగా నిలిచే రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. లౌకిక పునాదుల మీద ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, స్వావలంబన విధానాలతో ముందుకు సాగుతున్నాం. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం అభద్రతలో కూరుకు పోయింది. మత, విద్వేషాలతో కాలం గడుపుతూ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చూస్తున్నది. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగానికి బీజేపీ యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నది. భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం చేర్చాలని వాళ్ల అభిలాష. బ్రాహ్మణ భావజాల అధిక్యతతో కూడిన కుల వ్యవస్థ యధావిధిగా కొనసాగాలని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు అణగదొక్కబడి ఉండాలనేది వారి అభిమతం. మనుధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీలకు స్వేచ్ఛ హక్కులు ఉండకూడదు కాబట్టి వీరు మహిళా రిజర్వేషన్‌ బిల్లును కూడా పెండింగ్‌లో పెట్టారు. ఉత్తరప్రదేశ్‌ అత్రాస్‌ ఘటనను చూశాం. మహిళలపై వేధింపులు హత్యలు, దాడులు ఈ కాలంలో పెద్దఎత్తున పెరిగాయి. బీజేపీ ఎంపి కిరణ్‌ మోరే లైంగికదాడులు మన సంస్కృతిలో భాగం అనేదాక వీళ్ళ వికృత చేష్టలు పెరిగిపోయాయి. విద్యను కాషాయీకరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావ జాలాన్ని చిన్న పిల్లల మెదళ్లలో ఎక్కించి శాస్త్రీయత స్థానంలో అశాస్త్రీయతను ప్రవేశపెట్టడం, అజ్ఞానాన్ని పెంపొందించడం, చరిత్రను వక్రీకరించడం, రాబోయే తరాల్లో దేశభక్తి లేకుండా చేయటం, వాస్తవాలు తెలియకుండా చేయడం లక్ష్యంగా ఉంది. ఈ చర్యలు, దాడుల వెనుక ఉన్న ఉద్దేశమంతా ఒకటే. భారత కార్మిక వర్గాన్ని, ఐక్యతను విచ్ఛిన్నం చేసి తమ కార్పొరేట్‌ విధానాలను కొనసాగించడం.
కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా చట్టాలు
కార్పొరేట్‌ శక్తులు బీజేపీకి అండగా నిలబడుతున్నాయి. రూ. వేల కోట్లు అందజేస్తున్నాయి. అందుకే కేంద్రం వారి చెప్పు చేతల్లో పాలన సాగిస్తున్నది చెప్పేది నిజం! 2014 నుండి ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వంతో ఆశ్రిత పెట్టు బడిదారుల విధానాన్ని నిస్సిగ్గుగా కొనసాగిస్తూ దేశ సంపదను లూటీ చేసేలా కొద్దిమంది కార్పొరేటర్‌ శక్తుల్ని శతకోటీశ్వరులను చేసింది.ఎన్నో సంవత్సరాలుగా కార్పొరేట్‌ శక్తులు డిమాండ్‌ చేస్తున్నట్టుగా కార్మిక చట్టాల మార్పులను మోడీ ప్రభుత్వం విజయవంతంగా చేస్తున్నది. 44 కేంద్ర చట్టాల స్థానంలో 29 చట్టాలను కలిపి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చారు. వీటివల్ల కనీస వేతన నిర్ణయం ప్రభుత్వాల చేతుల్లోకి పోయి యజమానిచ్చినంత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 8గంటల పని దినం స్థానంలో 12గంటలు పని దినం చట్టం వస్తుంది. కేంద్ర చట్టాలు అమల్లోకి రాకముందే బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 12గంటల పనిదినం అమలుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. యూనియన్లు పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తూ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లారుమెంట్‌ను తీసుకువస్తున్నారు. 300 మందిలోపు పనిచేసే కార్మికులు గల పరిశ్రమలను మూసివేసు కోవడానికి, తొలగించుకోవడానికి యజమానులకు సర్వహక్కులు ఇచ్చారు. తనిఖీల వ్యవస్థను పూర్తిగా మార్చివేసి యజమానులు అన్ని చట్టాలు అమలు చేస్తామని రాసిస్తే సరిపోతుందని చెపుతున్నారు. దేశంలోని పారిశ్రామిక రంగంలో ఆటవిక రాజ్యాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. భారత కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటి స్తున్నది కాబట్టే ఇంకా ఈ కోడ్‌లు అమల్లోకి రాలేదు.
ప్రభుత్వ ఆస్తులు ప్రయివేటుకు ధారాదత్తం
మేక్‌ ఇన్‌ ఇండియా పేరిట ఆర్థిక అభివృద్ధిని సాధిస్తామని, ఉద్యోగాలు సృష్టిస్తామని, జీడీపీని పెంచుతామని, తయారీ రంగం వాట పెంచుతామని ఇలా అనేక వాగ్దానాలు చేశారు. ఏవీ నెరవేరలేదు. పైగా ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రయివేటీకరణ విధానాలు యథేచ్ఛగా అమలు చేస్తున్నారు. రక్షణ రంగంలో 49శాతం, అంతరీక్షంలో 74శాతం, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 10 నుండి 74శాతం, 100 రంగాల్లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారు. గతంలో వాజ్‌పాయి ప్రభుత్వం గానీ, ఇప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గానీ 23 ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించారు. నూతన ఆర్థిక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం కోసం గతంలో బీజేపీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణశాఖ అరుణ్‌ శౌరి ఆధ్వర్యంలో పనిచేసిన విషయం గమనించాలి. 2000 నుండి 2004 మధ్యన, తర్వాత 2014 నుండి 2023 మధ్యన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల విధ్వంసానికి పాల్పడింది. బాల్కో మొదలు ఎయిర్‌ ఇండియా, సిఎంసి, హిందుస్తాన్‌, జింక్‌, హెచ్‌టిఎల్‌, పిపిఎల్‌, పవన్‌ హాన్స్‌, విదేశీ సంచార నిగం లిమిటెడ్‌, హౌటల్‌ కార్పొరేషన్‌, ఐటీడీసీలను అమ్మారు. ప్రస్తుతం షిప్పింగ్‌ కార్పొరేషన్‌, ఎన్‌ఎండీసీ, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌, ఆర్‌ఐఎన్‌ఎల్‌ లేదా వైజాగ్‌ స్టీల్‌, ఐడిబిఐలను అమ్మకానికి పెట్టారు. 2018-19లో మొత్తం ప్రభుత్వరంగ సంస్థల ఆదాయం 24.43లక్షల కోట్లు. 2019-20 మధ్యలో టాప్‌ టెన్‌ ప్రభుత్వ రంగ సంస్థల లాభం రూ.1,38,112 కోట్లు. బంగారు బాతు లాంటి ప్రభుత్వరంగ సంస్థలను తెగనరికి కార్పొరేట్‌ వ్యక్తులకు నైవేద్యంగా మోడీ పెట్టబోతున్నాడు. అందుకోసం మరింత దూకుడును పెంచి 2025 నాటికి రూ.60 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను రూ.6 లక్షల కోట్లకే నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరిట అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది.
సింగరేణిని ప్రయివేటీకరించే కుట్ర!
ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులుగా ఉన్నటువంటి రైల్వేలో 1,52,000 కోట్లకు 400 రైల్వేస్టేషన్లు, 90ప్యాసింజర్‌ రైళ్లు, 1,400 కిలోమీటర్ల రైల్వే లైను, 741కిలోమీటర్ల కొంకన్‌ రైల్వే లైను, 15 రైల్వే స్టేడియంలో, 265 గోదాములు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే లైన్‌లు అప్పగిస్తున్నారు. 26,700 కిలోమీటర్ల నేషనల్‌ హైవేను రూ.1,60,000 కోట్లు, విమానాశ్రయాలను రూ.20,782 కోట్లకు, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ను రూ.45,200 కోట్లకు, 160 బొగ్గు బావులు, 761 మినరల్‌ బ్లాకులను కేవలం 28,747 కోట్లకు అప్పగిస్తున్నారు. రూ.3,500 కోట్లకు టెలికాం ఆస్తులను విక్రయిస్తున్నారు. రూ.20,900 కోట్ల విలువైన గిడ్డంగులు, రూ.12,828 కోట్లు విలువైన షిప్పింగ్‌ ఆస్తులు కూడా అమ్మకానికి పెట్టారు. మానిటైజేషన్‌ కాకుండా ఇప్పటికే ప్రభుత్వ వాటాలు విక్రయించడం వల్ల అనేక సంస్థల్లో ప్రయివేటు వాళ్లకు అవకాశం కల్పించారు. కోల్‌ ఇండియాలో 29.4శాతం వాటాను ప్రభుత్వం కోల్పోయింది. మన సింగరేణిలో 49శాతం కేంద్రం చేతులు ఉండడం వల్ల ప్రయివేటీకరణకు ప్రయత్నం చేస్తున్నది. రక్షణ రంగంలో 41 సంస్థలను కార్పొరేషన్లుగా మార్చివేశారు. దేశ ఆర్థిక స్వావ లంబన స్థానంలో అమెరికా అనుకూల, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంభిస్తూ పరాధీనతకు బాటలు వేస్తున్నారు.
మోడీ తెస్తానని చెప్పిన నల్లధనం ఏది?
పెద్దనోట్ల రద్దు సమయంలో నల్లధనంపై మోడీ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. విదేశాల్లో దాచిన డబ్బును తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమచేస్తానని చెప్పిన పెద్దమనిషి ఆ ఊసే మరిచారు. నోట్లు రద్దు చేసింది వాళ్లే, కొత్త నోట్లు తెచ్చింది వాళ్లే, ఆ తెచ్చిన కొత్త నోట్లను కూడా రద్దు చేస్తున్నది మళ్లీ వాళ్లే. ఇదంతా బడాపెట్టుబడిదారుల మేలుకే! దేశంలో నిరుద్యోగం ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగినా పట్టింపు లేదు. విద్వేష పాలనపై ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత, కాంట్రాక్టు, కార్మికులు, స్కీం వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు దేశంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వాటిని అణిచివేయడానికి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు కాషాయ పరిపాలకులు. కేంద్ర బీజేపీ ఎత్తుగడలను ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత అమలు కార్మికవర్గం సమిష్టిగా అడ్డుకోకపోతే కార్మికవర్గ ఐక్యత విచ్ఛిన్నం అవుతుంది. కార్మికులు మరింత దోపిడీకి గురవుతారు. దీన్ని ప్రతిఘటించేలా ఎక్కడికక్కడ ఉద్యమాలు నిర్మించాలి. కార్మికుల కష్టాన్ని కార్పొ రేట్లకు దోచిపెట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాలి. అందుకు కార్మికులు మరింత చైతన్యవంతంగా, సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు మే నెలంతా కూడా సీఐటీయూ నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలి. అందుకు వాడవాడలా ప్రచారం చేయాలి. కార్మికుల్లో, పని ప్రదేశంలో, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి.


భూపాల్‌
9490098034

Spread the love