రూ.7.5 లక్షల కోట్ల అక్రమాలపై నోరువిప్పండి

– కాగ్‌ నివేదికపై ప్రధాని మౌనాన్ని ప్రశ్నించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌
చెన్నై : మోడీ ప్రభుత్వ హయాంలో సుమారు 7.5 లక్షల అక్రమాలు జరిగినట్టు కాగ్‌ తన నివేదికలో పేర్కొందని, దీనిపై ప్రధాని మౌనం వీడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కాషాయ పార్టీ ఆగడాలను ఆపేందుకు ప్రజలంతా ఏకం కావాలన్నారు. మత, విభజన, నిరంకుశ, కార్పొరేట్‌ రాజకీయాలను తరిమికొట్టాలన్నారు. ‘స్పీకింగ్‌ ఫర్‌ ఇండియా’ పేరుతో కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యాన స్టాలిన్‌ ప్రసంగ వీడియోలను ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగ్‌ ఇచ్చిన నివేదికపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని తాజా కార్యక్రమంలో సీఎం ప్రశ్నించారు. ఇండియా కూటమి అవినీతికి పాల్పడుతున్నట్లు మోడీ ఆరోపిస్తున్నారని, కానీ మోడీ పాలనలో దాగిన అవినీతిని కాగ్‌ ఎత్తిచూపిందని తెలిపారు. ఆ రిపోర్టును మీరు చదివారా? ప్రత్యేక పార్లమెంట్‌ సెషన్‌లో దాని గురించి చర్చించారా? అని స్టాలిన్‌ ప్రధానిని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంలో అయిదు సీలు ఉన్నాయని, కమ్యూనలిజం (మతతత్వం), కరప్షన్‌ (అవినీతి), కార్పొరేట్‌ పెట్టుబడిదారులు (కార్పొరేట్‌ క్యాపిటలిజం), చీటింగ్‌, వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్‌ అసాసినేషన్‌)లకు పాల్పడుతోందని స్టాలిన్‌ విమర్శించారు.

Spread the love