– బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రతిష్టాత్మక జీ-20 సదస్సు ఢిల్లీలో జరుగుతున్నదనీ, వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనులకు పాల్పడుతున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం విమర్శించారు. గురవారంనాడాయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశాభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించట్లేదనీ, గ్లోబల్ లీడర్‌గా అవతరించిన ప్రధాని నరేంద్రమోడీని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారని అన్నారు.
సనాతన ధర్మాన్ని కూడా అవహేళన చేస్తూ, దుర్భాషలాడుతున్నారనీ, ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదనీ, కానీ ప్రతిపక్ష పార్టీల ప్రవర్తన దీనికి భిన్నంగా ఉందని ఆరోపించారు. భారత్ పేరుపై కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతి ఢిల్లీ దాకా పాకిందనీ, బీఆర్‌ఎస్, డీఎంకే నేతలు ప్రతి ప్రభుత్వ పథకంలో కమీషన్ దండుకుంటున్నారని ఆరోపణలు చేశారు.