స్వపక్షంలోనే బైడెన్ కు వ్యతిరేకత..!

నవతెలంగాణ – వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ నామినీ జో బైడెన్  వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా సొంత పార్టీలోని కీలక ప్రతినిధులే ఆయన వైదొలగాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్‌ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా మంది బైడెన్‌ నిష్క్రమించాలని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ట్రంప్‌తో  సంవాదంలో బైడెన్‌ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో హకీం ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్‌ పోటీలో ఉండొద్దని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి.

Spread the love