అసెంబ్లీ ఎన్నికల్లోగా జగన్‌పై సీబీఐ కోర్టు తీర్పు చెప్పేలా ఉత్తర్వులివ్వండి

– తెలంగాణ హైకోర్టులో ఏపీ మాజీ మంత్రి హరిరామజోగయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసులపై తీర్పులను 2024 అసెంబ్లీకి ఎన్నికలకు లోపే సీబీఐ కోర్టు తీర్పులు చెప్పేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఆ పిల్‌కు నెంబర్‌ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. విచారణను జులై ఆరో తేదీకి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు, రాష్ట్రపతిలకు వినతిపత్రాలతో కూడిన లేఖలు పంపామని పిటిషనర్‌ లాయర్‌ చెప్పారు. అలాంటి లేఖలు అన్ని కోర్టులకూ వస్తూనే ఉంటాయనీ, వాటిని ఆధారంగా చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులుండకూడదనే సదుద్ధేశంతో పిల్‌ వేశామని లాయర్‌ చెప్పగా..రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలివ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Spread the love