యూసీసీపై సంఘటిత పోరు

– ఎన్నికల వేళ కాషాయ కుతంత్రాలు
– ప్రజల్లో చీలిక తేవడమే బిజెపి లక్ష్యం
– కొజికోడ్‌ జాతీయ సెమినార్‌ను ప్రారంభిస్తూ ఏచూరి
కొజికోడ్‌ : అడుగడుగునా జీవన వైవిధ్యంతో వికసిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న భారతావనిలో దేశ ప్రజలందరికీ వారి సంస్కృతీ, సాంప్రదాయాలను గౌరవించకుండా ఒకే కోడ్‌ అమల్జేస్తామంటే అది విచ్ఛిన్నానికి దారితీస్తుందని, ప్రజల మధ్య చీలికలు తీసుకొస్తుందని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు. తొమ్మిదేండ్లు నిద్ర నటించి ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పేరుతో బీజేపీ చేస్తున్న కుతంత్రాలను సంఘటిత పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. యూసీసీకి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొజికోడ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్‌ను ఏచూరి ప్రారంభించారు. లౌకిక వాదులు, రాజ్యాంగ నిపుణులు, వివిధ సామాజిక తరగతుల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సెమినార్‌నుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ .. మత పరంగా సమాజాన్ని చీల్చే లక్ష్యంతోనే బీజేపీ ప్రభుత్వం యూసీసీని ఏకపక్షంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశ వైవిధ్యతను పరిరక్షించడం, ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించాలన్నదే సీపీఐ(ఎం) విధానమని స్పష్టం చేశారు. దీన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇతర ఎజెండాలు వున్నాయని, ఇది పక్కా రాజకీయ ప్రణాళిక అని అన్నారు. దేశ బహుళత్వాన్ని పరిరక్షించడానికే ఈ సదస్సు అని పేర్కొన్నారు. వివిధ సామాజిక తరగతులు వారికి సంబంధించిన చట్టాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని, అంతే కానీ లోపాలున్నాయనే పేరుతో అన్ని సామాజిక తరగతులపైనా ఒకే కోడ్‌ బలవంతంగా రుద్దడం సరికాదని ఏచూరి నొక్కి చెప్పారు.వివక్ష పూరిత చట్టాలను సరిదిద్దాల్సిందే..  ఏకరూపత అంటే సమానత్వం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వివక్షాపూరితంగా వున్న చట్టాలను సరిదిద్దాల్సిన అవసరం వుందని అన్నారు. యూసీసీని ప్రతి ఒక్కరిపై బలవంతంగా రుద్దడానికి బదులుగా మొత్తంగా ఆయా కమ్యూనిటీతో సవివరంగా సంప్రదింపులు జరిపిన తర్వాతనే అమలు చేయాల్సి వుందన్నారు. ‘ఒకే సివిల్‌ కోడ్‌ విధించాల్సిన అంశం కాదు, మత పరమైన విభజనే దీని లక్ష్యం. సమాజాన్ని మతాల వారీగా చీల్చడానికి ఇది ఆరంభం. ఎన్నికల ముందు బీజేపీ ఎత్తుగడ ఇది. ప్రపంచం వైవిధ్యం కోసం ప్రయత్నిస్తుండగా, భారతదేశం ఏకీకరణ కోసం పాటు పడుతోంది. ఏకపక్షంగా ఉమ్మడి పౌర స్మృతిని విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఏచూరి పేర్కొన్నారు. సమానత్వం అంటే ఏకీకరణ కాదని అన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోవాలని, ఏకపక్షంగా యూసీసీ విధించడాన్ని ఎంత మాత్రమూ అనుమతించరాదని ఏచూరి పేర్కొన్నారు. ఈ తరుణంలో యూసీసీ అమలు అనవసరమని 21వ లా కమిషన్‌ నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఏచూరి గుర్తు చేశారు. దేశంలోని ప్రతి ఒక్క సామాజిక తరగతికి తమదైన గౌరవం, విలువ వుంటాయని, సమానత్వానికి సిపిఎం మద్దతిస్తుంది, కానీ అది ప్రజాస్వామ్యయుతంగా వుండాలన్నారు. వివిధ సామాజిక తరగతులకు విభిన్నమైన మతాచారాలు, సాంప్రదాయాలు వుంటాయి. పరిపక్వత అంటే వైవిధ్యతను ఆమోదించడమే. రాజ్యాంగం వైవిధ్యతను గుర్తించాలని అన్నారు.
మణిపూర్‌పై మోడీ మౌనమెందుకు?
దేశంలో మారణహోమం అనేది నిత్యకృత్యంగా మారింది. మణిపూర్‌లో ఏం జరుగుతోంది? మతపరంగా ప్రజలను చీల్చే ఉద్దేశంతోనే చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ లక్ష్యంతోనే బీజేపీ యూసీసీని చర్చిస్తోంది. దేశంలో దాదాపు రోజూ ముస్లిం గ్రూపులపై దాడులు జరుగుతునే వున్నాయి. ఒకపక్క మణిపూర్‌లో మారణహోమం కొనసాగుతున్నా ప్రధాని మాత్రం ఈ విషయాలపై అసలు నోరు విప్పడం లేదని ఏచూరి విమర్శించారు. భారత రాజ్యాంగం సమానత్వం కోసం నిలబడినట్లే సీపీఐ(ఎం) కూడా సమానత్వం కోసం నిలబడుతుందని అన్నారు. ఆ సమానత్వం కోసమే మనం పోరాడాల్సిన అవసరం వుందని అన్నారు. ముందు మనిషి అని ఆ తర్వాతే మిగతావన్నీ అని ఆయన తెలిపారు. భారతీయులపై యుసిసి కలిగించే ప్రభావం పట్ల ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఏకరూపతను విధించడానికి జరిగే ఏ ప్రయత్నమైనా దేశ సామాజిక కూర్పును చీలుస్తుందని హెచ్చరించారు. కేవలం ప్రజలను విభజించడానికి ఉద్దేశించిన నినాదమే యూసీసీ, అంతేకానీ వాస్తవానికి ఎలాంటి ఏకరూపతను సాధించలేమన్నారు. సరోవర్‌ బయోపార్క్‌ సమీపంలో కాలికట్‌ ట్రేడ్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ సెమినార్‌కు లౌకిక వాదులు, వివిధ సామాజిక తరగతుల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమస్త కేరళ జమైతుల్‌ ఉలేమాతో సహా ముస్లిం కమ్యూనిటీకి చెందిన అనేక సంఘాలు, సంస్థలు, వివిధ క్రైస్తవ సంఘాలు సెమినార్‌లో పాల్గొన్నాయి. ఎంపీలు ఎలమారమ్‌ కరీం, జోస్‌ కె.మణి, మంత్రులు పి.ఎ.మహ్మద్‌ రియాజ్‌, ఎ.కె.శశీంద్రన్‌, అహ్మద్‌ దేవర్‌కోవిల్‌, వివిధ క్రైస్తవ మతాధిపతులు, బిషప్‌లు హాజరయ్యారు. వివిధ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సంఘాల ప్రతినిధులు కూడా సెమినార్‌లో పాల్గొన్నారు.

Spread the love