ఉస్మానియా ఆస్పత్రిని పునర్‌ నిర్మించాలి

– డాక్టర్ల డిమాండ్లను నెరవేర్చాలి :మహాధర్నాలో ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు
– త్వరలో వైద్యగర్జన నిర్వహిస్తామని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని పునర్‌ నిర్మించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన మహాధర్నాలో సంఘం నాయకులు డాక్టర్‌ పల్లం ప్రవీణ్‌, డాక్టర్‌ బొంగు రమేశ్‌, డాక్టర్‌ లాలు ప్రసాద్‌ రాథోడ్‌ తదితరులు మాట్లాడారు. ఉస్మానియా ఆస్పత్రిని ట్విన్‌ టవర్స్‌గా నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో మాటిచ్చారని గుర్తుచేశారు. అయితే కోర్టు కేసులున్నాయనే సాకుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాన్ని నిర్మించి, నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల పనుల్ని ప్రారంభించిన ప్రభుత్వానికి ఉస్మానియా నిర్మాణం ఎందుకు సాధ్యం కాదని వారు ప్రశ్నించారు. గతంలో ఎంఐఎం పార్టీ అడ్డుపడుతుందనీ సాకులు చెప్పారనీ, అయితే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ స్వయంగా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి పునర్‌ నిర్మాణానికి అభ్యంతరం లేదని ప్రకటించిన విషయాన్ని నాయకులు గుర్తుచేశారు. డీఎంఈ పరిధిలో పని చేసే వైద్యులకు పీఆర్సీ ఎరియర్స్‌ బకాయిలు విడుదల చేయాలనీ, జీవో నెంబర్‌ 142 రద్దు చేస్తూ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పోస్టులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చేసినట్టుగా టీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. డిమాండ్లను నెరవేర్చకుంటే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి త్వరలో వైద్యగర్జన నిర్వహిస్తామనీ, ఉధృత సమ్మెకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నరహరి తదితరులు పాల్గొన్నారు.
ఛలో డీహెచ్‌ కార్యాలయం
మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం హలో డాక్టర్‌ …ఛలో డీహెచ్‌ పేరుతో బుధవారం మధ్యాహ్నం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. కోఠిలోని డీహెచ్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ లాలు ప్రసాద్‌ రాథోడ్‌, డాక్టర్‌ బొంగు రమేశ్‌, డాక్టర్‌ పల్లం ప్రవీణ్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. జీవో నెంబర్‌ 142ను రద్దు చేయాలని కోరారు.

Spread the love