యువతకు మాది భరోసా

యువతకు మాది భరోసా– అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
– పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పూర్తి స్థాయిలో ప్రక్షాళన : కేటీఆర్‌
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువత భవిష్యత్‌కు తమ పార్టీదే పూర్తి బాధ్యత అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అశోక్‌నగర్‌తో పాటు యూని వర్సిటీలలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న పలువురు విద్యార్థులు కేటీఆర్‌ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో ఉద్యోగాల నియామకం, ఏర్పడ్డ అడ్డంకులను చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెప్పిన సలహాలు సూచనలను పూర్తి సానుకూల దక్పథంతో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.. అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పనితీరు విషయంలో విద్యార్థుల ఆకాంక్షలకు అనుకూలంగా పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంతో పాటు. వివిధ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని వేగంగా ఖాళీలను భర్తీ చేస్తా మని చెప్పారు. ప్రభుత్వ ఉద్యో గాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరు శంకిం చాల్సిన అవసరం లేదన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 1,62,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు.
దేశంలో తెలంగాణ కన్న ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను గత పది సంవత్సరాల్లో భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదన్నారు. తమపై కేవలం రాజకీయ దురు ద్దేశంతో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాష్ట్ర యువకులకు సమాధానం చెప్పా లని డిమాండ్‌ చేశారు. యువకులు, విద్యార్థులను కాంగ్రెస్‌ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం రెచ్చగొడు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్‌ చేస్తున్న అసత్య పూరిత ప్రచారాలను తిప్పికొట్టి నిజాలు తెలుసుకోవాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. కాగా కేటీఆర్‌తో భేటీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమకున్న సందేహాలు నివృత్తి అయినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు.

Spread the love