మా డిమాండ్లు నెరవేర్చాలి

– తమిళనాడులో నిర్మాణ కార్మికులు ర్యాలీ
– సీఐటీయూ మద్దతు
చెన్నై : తమిళనాడులో నిర్మాణ కారులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు ఎగ్మోర్‌ నుంచి చెన్నైలోని తమిళనాడు సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు(టీఎన్‌సీడబ్ల్యూడబ్ల్యూబీ) తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలనీ, జీఓను ఆమోదించాలని వారు తమ డిమాండ్‌లను పునరుద్ఘాటించారు.
పలు సమావేశాల్లో సీడబ్ల్యూడబ్ల్యూబీ అనేక నిర్ణయాలు తీసుకున్నది. పింఛను రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచడం, కార్మికుడికి 60 ఏండ్లు నిండిన రోజు నుంచి పెన్షన్లు, 55 ఏండ్ల నుంచి మహిళా కార్మికులకు పెన్షన్లు.. అదనంగా ప్రతినెలా 10వ తేదీలోగా పింఛను ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ ర్యాలీకి సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సమాఖ్య (సీడబ్ల్యూఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షులు కెపి పెరుమాల్‌ నాయకత్వం వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎ సౌందరరాజన్‌ పాల్గొన్నారు. ”ర్యాలీ డిమాండ్లలో డీఎంకే ఎన్నికల హామీలు ఉన్నాయి. వాటిని నెరవేర్చకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారు. నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి చట్టపరమైన ప్రయోజనాలు లేవు. సంక్షేమ బోర్డుపైనే ఆధారపడుతున్నారు. సంక్షేమ బోర్డు అనేక నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం ఒక్కదానికీ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. వర్షాకాలంలో పని లేని భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్రం ఉపశమనం కల్పించాలి” అని పెరుమాల్‌ అన్నారు.
ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి డి కుమార్‌ మాట్లాడుతూ.. ”ప్రభుత్వం అందించే రూ. 1,000 పింఛను సరిపోవడం లేదు. దానిని పెంచాలి. హౌసింగ్‌ స్కీమ్‌ కోసం చాలా మంది దరఖాస్తుదారులకు ఇవ్వాల్సిన గ్రాంట్‌ అందలేదు” అని అన్నారు. ఈ ర్యాలీ 24 పాయింట్ల డిమాండ్లను నొక్కి చెప్పింది. ర్యాలీ అనంతరం యూనియన్‌ నాయకులు తమిళనాడు కార్మిక సంక్షేమ శాఖ కార్యదర్శి కుమార్‌ జయంత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ ఏడాది జూన్‌లో భవన నిర్మాణ కార్మికులు జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను జిల్లా కలెక్టర్లకు అందించారు. అయితే ఎలాంటి పురోగతి లేకపోవటంతో రాష్ట్ర రాజధానిలో ఈ ర్యాలీకి సీడబ్ల్యూఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.

Spread the love