– కలెక్టరేట్ల వద్ద వీవోఏల ముట్టడి ఉద్రిక్తం
– పలుచోట్ల పోలీసుల అడ్డగింతలు
– తోపులాటలో సొమ్మసిల్లిన ఐకేపీ వీవోఏలు
– సీఐటీయూ నాయకుల అరెస్ట్
నవతెలంగాణ- విలేకరులు
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 36 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న ఐకెపీ వివోఏలు సోమవారం కలెక్టరేట్లను ముట్టడించారు. ఈ క్రమంలో పలు చోట్ల ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురు వీఓఏలు సొమ్మసిల్లి పడిపోయారు. సీఐటీయూ నేతలను అరెస్టు చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎస్‌హెచ్‌జి సభ్యులకు పావుల వడ్డీ, శ్రీనిధి, అభయస్తం డబ్బులు చెల్లించాలని కోరారు. ఐదు లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వందలాది మంది వీవోఎలు సీఐటీయూ ఆధ్వర్యంలో మండుటెండల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. తమ సమస్యల్ని పరిష్కరించే వరకు తమ పోరాటం ఆపబోమంటూ బైటాయించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వందలాది మంది వీవోఏలు భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అధికారులకు విన్నవిస్తామంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్, నాయకులు అనిత ఇతరులను అరెస్టు చేశారు. వీవోఏలను ఈడ్చుకెల్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తోపులాటలో పదులు సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. కలెక్టరేట్ వద్దకు ఏపీడీ వచ్చి తమ పరిధిలో ఉన్నవి పరిష్కారం చేస్తామని, మిగతా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.నల్లగొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీఐటీయూ, వీఓఏలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, 400మంది వీఓలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వివోఏలు కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేట్ల ముందు బైటాయించి అధికారులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులను వీవోఏలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కారు దిగి వచ్చి వారితో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖ మంత్రికి, సెర్ఫ్ సీఈఓకు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు తెలియజేస్తామని చెప్పారు. దాంతో సీఐటీయూ నాయకులతో కలిసి ఐకెపీ వివోఏలు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు పోలీసులకు.. వీఓఏలకు వాగ్వాదం జరిగింది.కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఐకేపీ వీవోఏలు ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వరకు వీఓఏలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆసిఫాబాద్ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వీఓఏల నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. అదనపు కలెక్టర్ రాజేశానికి దారి వదలకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. చివరకు 11 గంటలకు కలెక్టర్ వచ్చే సమయానికి వీఓఏలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వీఓఏల ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు దుంపల రంజీత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.