– ఆ పోరాటంలో ఎవరు కలిసొస్తే వారిని కలుపుకునిపోతాం: సీపీఐ(ఎం) విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగానూ బీజేపీని నిలువరించటమే తమ పార్టీ ప్రధాన కర్తవ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకు సంబంధించిన పోరాటంలో అన్ని శక్తులనూ కలుపుకునిపోతామని ఆయన చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తమ్మినేని మాట్లాడుతూ కేవలం ఎన్నికల సందర్భంలోనే గాక బీజేపీని, దాని మతోన్మాద భావజాలాన్ని అన్ని సమయాల్లోనూ నిలువరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను ఆ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో ప్రజలు దాని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ, దాని విధానాలకు వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తులనూ కలుపుకుని ముందుకు పోవాలని కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, నిధుల కొరత పేరిట వాటి అమలును ఎగ్గొట్టే ప్రయత్నం చేయొద్దని కోరారు. రైతు భరోసా, రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సహాయం, ఇండ్లు, ఇండ్ల పట్టాలు, కార్మికులకు కనీస వేతనాల అమలు తదితర ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రేవంత్‌రెడ్డిని తమ్మినేని కోరారు.