మన అమ్మే…

Our mother...– తల్లి విగ్రహాన్ని భవిష్యత్‌లో మార్పు చేస్తే చట్టపరంగా చర్యలు
– స్వరాష్ట్రం వచ్చింది ఓ వ్యక్తి, ఓ కుటుంబం, ఓ పార్టీ కోసం కాదు
– సోనియాగాంధీ వల్లే రాష్ట్రం ఏర్పాటు : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”మన అమ్మ రూపమే…తెలంగాణ తల్లి రూపం. జాతి గుర్తింపు, అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలకు తల్లే ఆధారం. ఆమెను గౌరవిస్తేనే జాతి మనుగడ సాధ్యమవుతుంది” అని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారంనాడాయన ఆవిష్కరించారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో, మెడలో గుండుపూసలు, హారం, ముక్కుపుడక, బంగారు అంచుతో ఆకుపచ్చ చీర, కాళ్లకు కడియాలు, మెట్టెలతో, ఒక చేతిలో వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకుల్ని చేతబట్టి, మరో చేతితో ఆశీర్వదిస్తూ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్రమంత్రులు, శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్‌ 9వ తేదీ ప్రాముఖ్యతను వివరించారు. ఆరోజే యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆరోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అప్పటి హోం మంత్రి చిదంబరం లోక్‌సభలో తొలిసారిగా ప్రకటన చేశారని గుర్తుచేశారు. అదే రోజు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినమనీ, ఆమె స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన దేవత అని కొనియాడారు. గత పాలకుల పాలనలో అధికారిక రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పుడు రూపొందించిన విగ్రహం కొందరికి నచ్చలేదనీ, కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒకపార్టీ కోసం తెలంగాణ రాలేదన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. భవిష్యత్‌లో విగ్రహ రూపురేఖల్ని ఏమాత్రం మార్చడానికి వీలులేకుండా చట్టపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ఏటా డిసెంబర్‌ 9వ తేదీన తెలంగాణ అధికారిక రాష్ట్ర ఉత్సవాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజా ప్రభుత్వ పాలన సాగుతుందనీ, కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తెస్తామనీ, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అసమానతల నుంచి అభివృద్ధివైపునకు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని స్పష్టంచేశారు. గత పాలకుల పదేండ్ల పాలనలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో కవులు, కళాకారులు వెన్నుదన్నుగా నిలిచి, ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తూ, సర్వస్వం ధారపోశారని గుర్తుచేసుకున్నారు. వారిని గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొమ్మిది మంది తెలంగాణ కవులు, కళాకారులకు అధికారికంగా తామ్ర పత్రాలు ఇచ్చి, తరతరాలకు వారి సేవలు స్ఫూర్తివంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ, అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, పాశం యాదగిరి, బండి యాదగిరి, గూడ అంజయ్య, గద్దర్‌, జయరాజ్‌ కుటుంబాలకు కోటి రూపాయల నగదు, ఫోర్త్‌సిటీలో 300 గజాల స్థలాన్ని బహుమానంగా ఇస్తున్నామని ప్రకటించారు. అమరుల త్యాగాలను మరువబోమని స్పష్టంచేశారు. అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యాలను వివరించారు. స్వరాష్ట్రం సిద్ధించినా గడచిన పదేండ్లలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదనీ, తామిప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అన్ని విధాలా గాడిన పెడుతున్నామని చెప్పారు. అనంతరం నిర్వహించిన డ్రోన్ల షో ఆహూతులను ఆకర్షించింది. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలను రూపొందించారు. బాణాసంచా వెలుగులు ఆహూతులను అబ్బురపరిచాయి. సచివాలయంతో పాటు ట్యాంక్‌బండ్‌ చుట్టుపక్కల పండుగ వాతావరణం ఏర్పడింది. సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.

Spread the love