రోజుకి కోట్ల రూపాయలు కూడబెట్టే కుబేరులున్న దేశం మనది… అంతేకాదు.. పట్టెడన్నం దొరక్క కాటికి వెళ్లే అభాగ్యులున్న నిలయమూ మనదే! ఈ చేదునిజమే యువతను కదిలించింది. అన్నార్తుల కడుపులు నింపాలనే సదాశయానికి ప్రేరణగా నిలిచింది. కొవిడ్ కర్కశత్వానికి కుటుంబాలే ఛిద్రమైపోయాయి. ఏడ్చి ఏడ్చి బాధితుల కన్నీళ్లు ఇంకిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ‘అయ్యో పాపం’ అని సరిపెట్టుకోకుండా నడుం బిగించి చేతనైన సాయం చేయడానికి యువత ముందుకొచ్చారు. అలా వచ్చిన తెలంగాణ యువకుడు జబ్బు వెంకటేష్. తను మొదలుపెట్టిన సేవా క్రతువు కొన్ని వందల మందిని చేరింది. ‘మన ఆపద్భాంధవులు ఫౌండేషన్’ పేరుతో సలక్షణమైన కార్యక్రమాలు చేపట్టేలా చేసింది. సరదాలే జీవితం అనుకునే వయసులో.. పరోపకారమే జీవితానికి సార్థకత అంటున్న మూడుపదుల స్ఫూర్తిప్రదాత ప్రస్థానం ఇది.
‘దేశమంటే మట్టికాదోరు.. దేశమంటే మనుషులోరు’ అన్నాడు గురజాడ. కానీ తిండి దొరక్క ఆ మనుషులు మట్టిలో కలిసిపోవడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఆ గడ్డుస్థితిని కొంతైనా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు నాగర్ కర్నూల్‌కు చెందిన జబ్బు వెంకటేష్. తనది ముందు నుంచీ సాయం చేసే గుణమే. కొలువులో స్థిరపడ్డాక దీన్ని విస్తరించడానికి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాలి అనుకునేవాడు. ఉద్యోగరీత్యా అది ఎప్పటికప్పుడు వాయిదా పడేది. కానీ ఒక దురదష్టకర సంఘటన తను కార్యక్షేత్రంలో వెంటనే దూకడానికి దోహద పడిందని తనను కలిసిన జోష్ బందంతో పంచుకున్నారు. ఆ విషయాలు తన మాటల్లోనే తెలుసుకుందాం..!
2020 సంవత్సరం కరోనా లక్‌డౌన్‌తో ఒక్కసారిగా రోజు కూలీల పరిస్థితి దారుణంగా మారింది. 2020 ఏప్రిల్ 28న రాజేంద్రనగర్ పరిధిలో లిమ్రా హౌటల్ దగ్గర నేను పికేట్ డ్యూటీలో ఉండగా ఒక జంట నా దగ్గరకు వచ్చి, ‘ఇక్కడెక్కడో బియ్యం ఇస్తున్నారంట కదా సారు, మేము గత వారం పది రోజుల నుంచి ఒక పూటే తింటున్నాం. ఈ పాడు రోగం రాక ముందు మేస్త్రీ పనిచేస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.1000 సంపాదించుకొని ఉన్నంతలో బతికేవాళ్ళం. కానీ కరోనా మా జీవనోపాధిపై దెబ్బకొట్టింది సార్’ అని ఆవేదన చెందారు. ఇక్కడెక్కడా బియ్యం ఇవ్వడం లేదని చెప్పి, వారి పరిస్థితికి జాలిపడి తక్షణంగా వారికి దగ్గరలో ఉన్న షాప్‌కి వెళ్లి 15 కిలోల బియ్యం, కొన్ని వంట సామాన్లు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. ఒక్కసారిగా కన్నీళ్ళతో చేతులు పైకెత్తి సార్ మమ్ములను బతికించిన వాళ్ళు అయ్యారు. మిమ్మల్ని తలుచుకొని ఈ 15 రోజులు అన్నం తింటాము అని వారు దండం పెట్టారు. ఆ ఘటన తలుచుకుంటే నా కళ్ళలో ఇప్పటికీ నీళ్ళు తిరిగాయి.
సెలబ్రిటీస్ చాలెంజ్ కి థీటుగా…
కరోనా సమయంలో సెలబ్రిటీస్ కుండలు కడగడం, బట్టలు ఉతకడం వంటివి ఛాలెంజ్ విసరడాన్ని నేను గమనించాను. వారికి ధీటుగా బియ్యం సరుకులు ఇస్తున్న ఫోటోను పెట్టి ‘ఛాలెంజ్ అంటే బట్టలు ఉతకడం, కుండలు తోవడం కాదు. విపత్కర పరిస్థితుల్లో జీవనోపాధి కోల్పోయిన ఏదైనా ఒక కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడే సరుకులు, బియ్యం ఇవ్వగలిగితే అదే మనం స్వీకరించే అతిపెద్ద చాలెంజ్’ అని ఒక ఛాలెంజ్ ఇచ్చాను. దానికి మొదటిగా నేవి ఉద్యోగి కాగుల వెంకటేష్ స్పందిస్తూ లాక్ డౌన్ కాబట్టి నా తరపున మీకు ఒక వెయ్యి రూపాయలు పంపిస్తానని అవసరమైన వారికి సరుకులు ఇప్పించండని నాకు సవాల్ స్వీకరించాడు. ఆ తరువాత పల్లె ఆంజనేయులు, ఏడుపుల వెంకటేష్, గోవర్ధన్, విష్ణు, మరి కొందరు మిత్రులు మేంసైతం అంటూ చేతులు కలిపారు. నా డ్యూటీ అయిపోయిన తరువాత నా పోలీస్ మిత్రులను కొంత మంది కలిసి ఆ వచ్చిన డబ్బులతో ఎక్కడైనా గహ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి, రోడ్డుపక్కన ఆకలితో మలమలమాడుతున్న వారికి బియ్యం, సరుకులు ఇస్తూ వచ్చాం.
ఏడుపుల వెంకటేష్ సలహాతో ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. మానవత్వం కలిగిన ఎంతో మందికి ఇదొక వేదికెందుకు కాకూడదని ”మన ఆపద్బాంధవులు” అని ఒక గ్రూప్‌ను క్రియేట్ చేశాం. తొలిరోజే 48 మంది మాతో భాగస్వాములయ్యారు. సుమారుగా రూ. 20వేలతో వివిధ ప్రాంతాల్లో ఆకలితో బాధపడుతున్న వాళ్లకు బియ్యం, నిత్యావసరాలు అందజేస్తూ ముందడుగు వేశాం. ఇలా రెండు లక్షల రూపాయలతో నిరుపేద కుటుంబాలకు అందించే సహాయం మరింత ముందుకు తీసుకువెళ్లాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫౌండేషన్ సహాయాలు పూర్తిగా ఆపేద్దాం అనుకుంటే కొంతమంది సభ్యులు మనం ఫౌండేషన్ పెట్టింది కేవలం కరోనా సమయంలో సాయం చేయడానికే కాదని, బీదాబిక్కి ఆకలితో బాధపడుతున్న కుటుంబాల కోసం మనం ఇంకొన్ని సేవలు చేయడానికి ముందు సాగుదాం అన్న మిత్రుల సలహలు, సూచనలతో మరింత ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. అలా రాజగిరి విష్ణు సహకారంతో ఏడుగురుతో ”మన ఆపద్బాంధవులు” పౌండేషన్ రిజిస్ట్రేషన్ చేశాం.
నా పేరు జబ్బు వెంకటేష్ నాగర్ కర్నూల్ జిల్లా పదర గ్రామం. అమ్మానాన్న చిన్న మల్లయ్య, తిరుపతమ్మ. నా సతీమణి మహేశ్వరి. పదవ తరగతి వరకు పదరలోనే చదువుకున్నాను. అమ్మానాన్న రెక్కల కష్టం, స్నేహితుడు శివ, మేనమామలు కడారి పర్వతాలు, బద్రిల ప్రోత్సాహంతో 2018 నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం 3వ బెటాలియన్ కానిస్టేబుల్‌గా ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహిస్తున్నాను.
జీవనోపాధి
ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టడమే కాదు.. దీర్ఘకాలంలో మెరుగైన సమాజం ఏర్పడాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. మా నుంచి సాయం పొందుతున్న వాళ్లు బంగళాలు, కార్లు, నగలు అడగడం లేదు. మాకు, మా పిల్లలకు పట్టెడన్నం పెడితే చాలంటున్నారు. తిండి లేనివారికి అన్నం పెట్టడం ఈ సమాజం బాధ్యత. ఈ క్రమంలో మేం చేస్తున్న సాయం సముద్రంలో నీటి బొట్టంత. దీన్ని ఇంకా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దేశంలో ఆకలి కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదు అన్నదే నా కోరిక. అలాంటి కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆలోచనతో ఆయా కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని మా పౌండేషన్ నిర్ణయించింది. కనీసం రోజుకు రూ.200 సంపాదించుకోగలిగేలా కల్వకుర్తి, ఆదిభట్ల ప్రాంతాల్లో మహిళాల చేత కిరాణం షాపులు నిర్వహించేలా, మరి కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది మంది మహిళలకు కుట్టు మిషన్ ఇప్పించి వారి కుటుంబాలకు జీవనోపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది కేవలం ఏ ఒక్కరితోనో సాధ్యమైంది కాదు. మా పౌండేషన్ సభ్యుల పిల్లల పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, ఇంట్లో జరిగే మంచిచెడులకు మా వంతు సహాయం అంటూ పంపుతున్న ప్రతిరూపాయి ఈ విధంగా సద్వినియోగం అవుతుంది.
గత నాలుగేండ్లుగా ఎంతో నమ్మకంగా, విలువలతో పౌండేషన్ చేస్తున్న సేవలను అభినందిస్తూ మా డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంస పత్రం అందజేశారు. జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ వంటి పెద్దలు అభినందించారు. ఇటీవల యువకవి నాగిళ్ళ రమేష్ రాసిన ‘నల్లకొడిసె వన్నెకాడు’- పుస్తకాన్ని ‘మన ఆపద్బాంధవులు ఫౌండేషన్’ అధ్యక్షుడిగా నాకు అంకితం అందించడమంటే పౌండేషన్‌కు అంకితం ఇవ్వడమే.
నాలుగు వేల కుటుంబాలకు చేయూత
48 మంది సభ్యులతో ప్రారంభమైన ఫౌండేషన్ నేడు 950 మంది సైన్యంతో రూ.40 లక్షల పైచిలుకు ధనంతో నాలుగు వేల కుటుంబాలకు చేయూతను అందించాం. వారి కుటుంబ పరిస్థితిని బట్టి 25 కేజీల నుండి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసరాలు అందజేశాం. అలా ఆకలితో బాధపడుతున్న కుటుంబాలు మమ్మల్ని సంప్రదిస్తే మేం నిర్ధారించుకొని ఫౌండేషన్ తరపున వారికి సాయం ఇప్పటికీ చేస్తున్నాం. ఆ వివరాలన్ని మా సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియ జేస్తూ పారదర్శకంగా ఉంటున్నాం. ఇలాగే వైకల్యంతో లేదా ప్రమాదల్లో కాళ్లు చేతులు విరిగి ఇల్లు గడవని వారికి, ప్రకతి విపత్తుల కారణంగా గూడు కొల్పొయిన కుటుంబాలకు, అమ్మానాన్నలను పొగొట్టుకొని అనాధలైన పిల్లలకు, వద్ధాశ్రమాలకు సైతం మా వంతు సహాయం చేస్తున్నాము. ఉపాధ్యాయులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పోలీసులు మేము సైతం అంటూ మాతో చేతులు కలిపారు. వారిలో ముఖ్యంగా ఎక్సైజ్ ఎస్‌ఐ సైదులు, నీలం శేఖర్, దత్తు వీరబాబు, శ్రీను నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, రవి, రామ్మూర్తి, వేముల సైదులు, నాగరాజులతో పాటు కల్పన, ఉమాదేవి, మౌనిక, షాహిన్ వంటి 60 మంది మహిళలుండటం ఎంతో గర్వంగా ఉంటుంది.
మానవత్వం కలిగిన మరికొంతమంది సభ్యులు ఫౌండేషన్‌లో భాగం కావాలని లేదా మీ చుట్టూ ఆకలితో బాధ పడుతున్న ఏదైనా ఒక కుటుంబానికి మీ వంతు సహాయాన్ని తెలియజేయాలని అంతులోనే అసలైన సంతప్తి దాగి ఉంది. మనం తినే అన్నం ముద్దులు ఒక మెతుకు పేదవాడికి సహాయం చేయాలి అనే ఒక దఢ సంకల్పం ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫౌండేషన్‌కి వెన్నుముకలా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలంటూ ముగించారు.
– జోష్ టీం.