యెండల సౌందర్య… 2016 రియో ఒలింపిక్స్‌కు మన దేశం నుండి తొలిసారి అర్హత సాధించిన ఇద్దరు క్రీడాకారిణుల్లో ఈమె కూడా ఒకరు. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్టులో స్థానం సంపాదించారు. జాతీయ టీంలో 12 ఏండ్ల పాటు కొనసాగారు. టీంకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించి 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత పొందిన తొలి తెలంగాణ క్రీడాకాణిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు సిద్ధమౌతున్న మన ఇండియా టీంకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆమెతో మానవి సంభాషణ…
మాది నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు గ్రామం. దిగువ మధ్య తరగతి కుటుంబం. అమ్మ చంద్రకళ, నాన్న సాయిలు. అమ్మ ఇంట్లోనే ఉండి బీడీలు చుట్టేది. 2015లో అనుకోకుండా నాన్న చనిపోయారు. నేను 7వ తరగతిలో ఉన్నప్పటి నుండే హాకీ ఆడేదాన్ని. స్కూల్లో ఉన్నప్పుడు ఖో-ఖో బాగా ఆడేదాన్ని. మా సీనియర్స్ హాకీ ఆడుతుంటే చూసి నేనూ ఆ ఆట నేర్చుకోవాలని అనుకున్నాను. మొదట్లో ఏదో వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఆడేదాన్ని. ఎప్పుడైతే సికింద్రాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం మొదలు పెట్టానో అప్పుడే హాకీనే నా ప్రపంచం అనే నిర్ణయానికి వచ్చాను. ఎలాగైనా ఇండియా టీంకి సెలక్ట్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాను. ఆ కోరిక తీరిన తర్వాత కోచ్ కావాలని కలలు కన్నాను. రిటైర్ అయిన తర్వాత డిప్లొమా చేశాను. దీనికి అవసరమైన కోర్సులు కూడా పూర్తి చేసి ఇప్పుడు మన అమ్మాయిల టీంకు కోచ్‌గా ఉన్నాను.
అప్పులు చేసేవారు…
మొదట్లో నేను హాకీ ఆడుతుంటే మా అమ్మానాన్న భయపడ్డారు. అమ్మాయిని కాబట్టి కంగారు పడ్డారు. తర్వాత ఆటలో నేను చూపిస్తున్న ఆసక్తి, బాగా ఆడటం చూసి ప్రోత్సహించారు. మొదట్లో టోర్నమెంట్లకు వెళ్ళాలంటే చాలా సమస్యలు ఉండేవి. డబ్బులు లేక అమ్మ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని పంపించేవారు. ఎంత ఇబ్బంది పడ్డా నన్ను మాత్రం ఆటలో ప్రోత్సహించారు. నా కోసం చాలా కష్టపడ్డారు.
రుణపడి ఉంటాను
సికింద్రాబ్‌లోని సారు హాస్టల్లో చేరిన తర్వాత తిండికి, ఉండటానికి, కోచింగ్‌కి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. ఇందులో నాకు సహకరించిన నా మొదటి కోచ్ మక్బూల్ సార్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను నిజామాబాద్ జిల్లా స్థాయిలో ఆడటానికి కారణం కూడా ఆయనే. 2009లో రైల్వేస్‌లో నాకు జాబ్ వచ్చింది. ఆర్ధిక సమస్యలు కొంత తగ్గడంతో అప్పటి నుండి ఆటపై మరింత దృష్టి పెట్టాను. మా తమ్ముడు కూడా హాకీ ప్లేయర్. ప్రస్తుతం వనపర్తిలో హాకీ కోచ్‌గా చేస్తున్నాడు. నాకు ఓ చెల్లికి కూడా ఉంది, తనకు పెండ్లయింది. నా మోకాలికి కాస్త ఇబ్బంది కావడంతో 2016లో రిటైర్‌మెంట్ తీసుకున్నాను. నాలుగేండ్ల కిందట పెండ్లయింది. మా వారు సాఫ్ట్‌వేర్‌గా చేస్తున్నారు.
నేషనల్ టీం బాగుంది
అమ్మాయిల టీంకి గతం కంటే ప్రోత్సాహం బాగుంది. నేషనల్ టీంకి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. గతంలో క్వాలిఫై కావడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు క్వాలిఫై అయ్యి అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళి ఆడుతున్నారు. ప్రస్తుతమున్న టీం మంచి పొజీషన్‌లో ఉంది. గతంలో చాలా మందికి హాకీ అంటే తెలీదు. హాకీ మన జాతీయ క్రీడ అయినా ఎవరూ దీని గురించి పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కొంత వరకు మార్పు వచ్చింది. అమ్మాయిలు కూడా ఈ క్రీడ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. స్కూల్ స్థాయి నుండే పిల్లలకు ఆటలో శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం.
ఆటలో నైపుణ్యం చూసి
మనకు విదేశీ కోచ్‌లు చాలా మంది అందుబాటులో ఉన్నారు. వారి నుండి ఎంత వరకు నేర్చుకోగలిగితే అంత నేర్చుకొని మన టీంకి శిక్షణ ఇవ్వడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. మొన్నటి వరకు విదేశీ కోచ్‌ల దగ్గర అసిస్టెంట్ కోచ్‌గా ఇచ్చాను. నా ఆటలో నైపుణ్యం చూసి ఇప్పుడు నాకు ఇండియా టీంకి కోచ్‌గా అవకాశం ఇచ్చారు. అయితే నా కోరిక ఏంటంటే విదేశీ కోచ్‌లు కాకుండా ఇండియా వాళ్ళనే కోచ్‌లుగా పెట్టుకునే స్థాయికి మన దేశం రావాలి. ప్రస్తుతం బెంగుళూరులో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎప్పుడు ఎలా ఆడాలి, ఏ సమయంలో ఎలాంటి ఎత్తుగడలు తీసుకోవాలి, ఎదుటి వాళ్ళకు కౌంటర్‌గా ఎలా ఆడాలి అనే దానిపై ఎక్కువ ఫోకస్ పెడతాం.
క్వాలిఫై అవుతారు
మన అమ్మాయిలు మొన్నటి ఏషియా గేమ్స్‌లో క్వాలిఫై కాలేక పోయారు. కానీ చాలా బాగా ఆడగలిగే సత్తా మన అమ్మాయిలకు ఉంది. ఈ నెల 13 నుండి ఒలింపిక్స్ పోటీలకు రాంచీలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. దాని కోసమే ప్రస్తుతం మన ఇండియా టీంని సిద్ధం చేస్తున్నాం. ఆటలో వాళ్ళు చూపిస్తున్న ఆసక్తి, పట్టుదల చూస్తే ఈ సారి కచ్చితంగా క్వాలిఫై అవుతారు అనే నమ్మకం నాకు వచ్చింది. నేను నేషనల్ టీంలో ఉన్నప్పుడు 2009లో జూనియర్ వరల్డ్ కప్ ఆడి సిల్వర్ కప్ సాధించాము. 2016లో సౌత్ ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించాము. 2016లో ఒలింపిక్ క్వాలిఫై కోసం ఆడి క్వాలిఫై అయ్యాము. 36 ఏండ్ల తర్వాత మొదటి సారి మన అమ్మాయిల టీం ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యింది. అది నేను మర్చిపోలేని అనుభూతి.
రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి
తెలంగాణలో మాత్రం హాకీ క్రీడ అసలు లేదు. ఆడాలన్నా ఆకాడమీ, గ్రౌండ్ సదుపాయం లేదు. సౌకర్యాలు ఉంటే ఆడటానికి ఆసక్తి చూపిస్తారు. మరో విషయం మనకు కోచ్‌లు లేరు. ఆడటానికి ఆసక్తి చూపించే పిల్లలు ఉన్నారు, వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఆడుకుని వెళ్ళిపోతారు. కానీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. దాని వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించి ఇక్కడ కూడా కింద స్థాయి నుండి సదుపాయాలు కల్పిస్తే మన రాష్ట్రం నుండి కూడా మంచి క్రీడా కారులు తయారవుతారు. తెలంగాణలో కూడా మంచి ప్లేయర్లను తయారు చేయాలని కలలు కంటున్నాను.
– సలీమ