మన ఊరు-మన బడి పనులకు ప్రాధాన్యత

– ఉప కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు
– గృహా లక్ష్మి పథకం ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత
– ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ రూ.51 కోట్ల చెల్లింపులు
– పీఎంజీఎస్‌ సీసీ రోడ్ల పనులు పూర్తి
– ఇంజనీరింగ్‌ డే సందర్భంగా నవతెలంగాణతో
– పంచాయతీ రాజ్‌ ఈఈ జగదీశ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘మన ఊరు-మన బడి’ పథకం కింద చేపట్టిన పనుల్ని త్వరిత గతిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నట్లు పంచా యతీ రాజ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ జగదీశ్‌ అన్నారు. ‘ఇంజనీర్స్‌ డే’ సందర్భంగా ఆయన నవతెలంగాణ ప్రాంతీయ ప్రతిని ధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రముఖ సివిల్‌ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వర య్య పేరిట నిర్వహించే ఇంజనీర్స్‌ డే సందర్బంగా ఇంజనీరింగ్‌ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ రాజ్‌ విభాగం పరిధిలో వివిద పథకాల కింద చేప ట్టిన నిర్మాణ పనుల ప్రగతి, ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరా లను ఆయన నవతెలంగాణకు వివరించారు. ప్రభుత్వం వివిద శాఖల పరి ధిలో చేపట్టాల్సిన పనులకు నిధులు మంజూరు చేసిన వెంటనే టెండర్లు పిలవడం, పనులకు సంబంధించిన అగ్రిమెంట్‌ చేసి పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షణ చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పనుల్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్న ఈఈ జగదీశ్‌ ఇంటర్యు వివరాలు ఇలా ఉన్నాయి…
నవతెలంగాణ: పంచాయతీరాజ్‌ విభాగంలో చేపడుతున్న వివిద పథకాలను వివరించండీ..?
ఈఈ: పంచాయతీరాజ్‌ పరిధిలో మన ఊరు-మన బడి, నూతన గ్రామ పంచాయతీ భవనాలు, వైద్య ఆరోగ్య శాఖ ఉప కేంద్రాల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ కింద కూలీల వేతనా లు, మెటీరియల్‌ కాంపొనెంట్‌, సీసీ రోడ్ల నిర్మాణం, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహా లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు కూడా పీఆర్‌ పరిధిలోనే జరగనున్నాయి.
నవతెలంగాణ: మన ఊరు-మన బడి పథకం కింద జరుగుతున్న పనుల ప్రగతి గురించి..?
ఈఈ: ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమా న్ని చేపట్టిందన్నారు. జిల్లాలో 441 స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేశారన్నారు. అందులో 329 స్కూల్స్‌లో స్టేట్‌ కాంపొనెంట్‌ కింద 1232 పనులు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 678 పనులు పంచాయతీ రాజ్‌ వి భాగం పరిధిలో జరుగుతున్నాయి. రూ.120 కోట్ల వ్యయంతో చేపట్టిన ప నుల్లో ఇప్పటికే 151 పనుల్ని పూర్తి చేశాం. మిగతా పనులు వివిద దశల్లో ప్రగతిలో ఉన్నాయి. వాటిని త్వరలోనే పూర్తి చేస్తాం.
నవతెలంగాణ: జిల్లాలో గ్రామ పంచాయతీ నూతన భవనాలు, ఉప కేంద్రాల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయా..?
ఈఈ: జిల్లాలో స్వంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవ నాలు నిర్మించేందుక రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కొ భవన నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ సంగారెడ్డి జిల్లాకు రూ.26.20 కోట్ల నిధుల్ని ప్రభుత్వం కేటాయించింది. జిల్లా వ్యా ప్తంగా 130 నూతన గ్రామ పంచాయతీలకు నూతన భవనాల్ని నిర్మించేం దుకు పనుల చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. కొన్ని చోట్ల పను లు కూడా జరుగుతున్నాయి. జిల్లాలో వైద్య సేవల్ని విస్తరించడం కోసం ఉప కేంద్రాలకు నూతన భవనాల్ని నిర్మించేందుకు నిధులు మంజూరయ్యా యి. జిల్లాలో 81 ఉప కేంద్రాలకు సొంత భవనాల్ని నిర్మించాలి. వీటి నిర్మాణానికి ఒక్కొదానికి రూ.20 లక్షల చొప్పున జిల్లాకు రూ.16.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పూర్తయ్యాయి. వీటి నిర్మాణ పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ: ఉపాది కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుంది ఎందుకు…?
ఈఈ: జాతీయ ఉపాధి హామీ పథకం కింద మార్చి వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించబడ్డాయి. రూ.51 కోట్ల నిధులు పేమెంట్‌ జరిగింది. మిగతా బిల్లుల చెల్లింపు కూడా జరగునుంది. కూలీల వేతనాలు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ బిల్లుల చెల్లింపులో ఆలస్యమేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహా లక్ష్మి పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాల్ని కూడా పీఆర్‌ ఎఈలే పర్యవేక్షించాల్సి ఉంది. మూడు దశల్లో బిల్లులు చెల్లించేందుకు బిల్లులు పారదర్శకంగా చేసేలా చూస్తాం.
నవతెలంగాణ: పీఎంజీఎస్‌వై కింద చేయాల్సిన సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయా..?
ఈఈ: పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 29 సీసీ రోడ్ల పనులు చేపట్టగా ఇప్పటికే 10 పనులు పూర్తయ్యాయి. మిగతా 9 పనులు కూడా గ్రౌండింగ్‌ దశలో ఉన్నాయి. రూ.7.60 కోట్ల నిధులతో మంజూరైన వంతెనల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. నాబార్డు ఆర్‌ఐడీఎప్‌ కింద కొన్ని వంతెనల పనులు జరుగుతున్నాయి. బీటీ, సీసీ రోడ్ల పనులు కూడా ప్రగతిలో ఉన్నాయి. వీటితో పాటు ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ జిల్లాలో పర్యటించిన సందర్భంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గం లోని గ్రామ పంచాతీలకు మంజూరు చేసిన నిధులకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి.

Spread the love