నవతెలంగాణ – న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు కార్యకలాపాలు మంగళవారం నుండి ప్రారంభమైనాయి. పాత భవనం సెంట్రల్ హాలులో సమావేశమైన ఎంపిలు అక్కడ నుండి పాదయాత్రగా నూతన భవనానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు నడిచారు. మంత్రులు, ఎంపిలు ఆయనను అనుసరించారు. సెంట్రల్ హాలులోని రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నూతన భవనంలోకి తరలించారు. సభలోకి సభ్యులు చేరిన వెంటనే జాతీయ గీతం ఆలాపించారు. సభ్యులు వారికి కేటాయించిన సీట్లలో కూర్చున్న తరువాత స్పీకర్ కొద్దిసేపు మాట్లాడారు. ఆ వెంటనే ప్రధాని తొలి ప్రసంగం చేశారు. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయ తత్వాలకు కలబోతగా నూతన పార్లమెంటు భవనాన్ని ఆయన అభివర్ణించారు. అంతకుముందు పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సభ్యుల నుద్ధేశించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంటటటు కార్యక్రమాలకు కలిగించే ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారాన్ని, ఏకాభిప్రాయ విధానాన్ని అలవర్చుకోవాలన్నారు.