మితిమీరిన విశ్వాసం ముంచేసింది

మితిమీరిన విశ్వాసం ముంచేసింది– వికటించిన ‘400 పార్‌’ నినాదం
– మోడీ ఇమేజ్‌ పైనే ఆధారం
– ప్రభావం చూపని మందిరం
– ఫలించని వ్యూహాలు
– బీజేపీ ఎదురు దెబ్బలకు కారణాలెన్నో
– బాబు, నితీష్‌ దయతో…
కర్ణుడి చావుకు ఆరు కారణాలు అన్న చందంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఆబ్‌ కీ బార్‌ 400 పార్‌’ నినాదాన్ని ఏడు అంశాలు నీరుకార్చాయి. ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 272కు 30-35 స్థానాల దూరంలో నిలిచింది. అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్న బీజేపీ అజెండా పూర్తయిన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. ఆర్టికల్‌ 370 కింద జమ్మూకాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదాను రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చిన తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. అయినప్పటికీ ఆ పార్టీ అనుకున్నది సాధించలేక చతికిలపడింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావచ్చునేమో కానీ ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు లేకుండా మాత్రం అది సాధ్యం కాదు.
న్యూఢిల్లీ : ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీకి రాకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధిపతి నితీష్‌ కుమార్‌ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పని పరిస్థితి. కూటములను తరచూ మార్చడం ద్వారా నితీష్‌ ఇప్పటికే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తాను ఎన్డీఏను వీడబోనని నితీష్‌ చెబుతున్నప్పటికీ ఆయన గత చరిత్రను గమనించిన వారికి అనుమానాలు కలగక మానవు. నితీష్‌ కుమార్‌కు ఉప ప్రధాని పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అటు చంద్రబాబుతో కూడా మంతనాలు సాగుతున్నాయి.
దెబ్బతీసిన అతి విశ్వాసం
ఇంతకీ బీజేపీకి ఎదురు దెబ్బలు తగలడానికి కారణాలేమిటి? ప్రధానంగా అతి విశ్వాసమే కొంప ముంచిందని పరిశీలకులు అంటున్నారు. ‘ఆబ్‌ కీ బార్‌ 400 పార్‌’ నినాదం కూడా ఎదురు తన్నింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం, మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కన్పించకపోవడంతో బీజేపీలో అత్యుత్సాహం, మితిమీరిన విశ్వాసం కన్పించాయి. అవే ఆ పార్టీని దెబ్బ తీశాయి. 2004లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కూడా ఇవే ధోరణులు కన్పించాయి. ‘ఫీల్‌గుడ్‌’, ‘ఇండియా షైనింగ్‌’ రూపంలో మితిమీరిన విశ్వాసం వ్యక్తమైంది. అదే ఆనాడు కొంప ముంచింది.
మోడీ గ్యారంటీల పైనే ఆధారం
ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని బీజేపీ విశ్వాసంతో ఉంది. ఆ విశ్వాసంతోనే ఈసారి ఆ పార్టీ కనీసం ఏ ఒక్క పథకాన్నీ ప్రకటించలేదు. ఫలితంగా ఎన్నికలకు ముందు సమాజంలోని ఏ ఒక్క వర్గాన్నీ ఆకర్షించలేకపోయింది. గత ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ప్రకటించారు. కానీ ఈసారి అలాంటి ఏ పథకాన్ని ముందుకు తీసుకురాలేదు. అదే సమయంలో ప్రతిపక్షాలు పలు ప్రజాకర్షక హామీలు కురిపించాయి. బీజేపీ మాత్రం ‘మోడీ గ్యారంటీ’లపై మాత్రమే ఆధారపడింది. కానీ అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
ఓట్లు రాల్చని మందిరం
పది సంవత్సరాల పాలన తర్వాత మోడీ ప్రభుత్వం వ్యతిరేక పవనాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాటిని గుర్తించడంలో సర్కారు విఫలమైంది. రామ మందిర నిర్మాణం బీజేపీకి ఓట్లు రాల్చలేదు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవి. హిందూత్వ శక్తులు శతాబ్దాల తరబడి ఎదురు చూపులు చూసిన తర్వాత అక్కడ మందిర నిర్మాణం జరిగింది. జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మందిర నిర్మాణం నుండి బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందుతుందని యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఓ అభిప్రాయం నెలకొంది. అందుకే ఎన్నికల సమయంలో కూడా మందిర నిర్మాణ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయినప్పటికీ యూపీలో ఆ పార్టీ భారీ పరాజయాలు చవిచూసింది. మందిర నిర్మాణం బీజేపీకి ఏ మాత్రం ఉపయోగపడలేదని స్పష్టమైపోయింది. ఫైజాబాద్‌లో (అయోధ్య ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది) సైతం బీజేపీ పరాజయం పొందింది. గత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన కొందరు ప్రజలు మందిర నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేసినప్పటికీ చాలా మంది మాత్రం ఇతర కారణాలతో మండిపడ్డారు.
ఫలించని ఎత్తుగడలు
రిజర్వేషన్లు, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయంటూ ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వం తప్పదని అవి పదేపదే చెప్పాయి. బీజేపీ తనకు 400కు పైగా స్థానాలు కావాలని కోరుకుంటోందని, అదే జరిగితే రిజర్వేషన్లు ఉండవని ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రచారం ప్రజల మనసుల్లో బాగా నాటుకుంది. ఈ ప్రయత్నంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయని ఫలితాలు రుజువు చేశాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను బీజేపీ వైపు ఆకర్షించడానికి ప్రధాని మోడీ చేయని ప్రయత్నమంటూ లేదు. ముఖ్యంగా పస్మందా ముస్లింలకు చేరువ కావడానికి ఆయన ఓ ప్రత్యేక ప్రచారాన్నే మొదలు పెట్టారు. అయితే అది పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా యూపీలో పస్మంద కార్డు ఏ మాత్రం ఉపయోగపడలేదు. 2019లో సమాజ్‌వాదీ, బీఎస్పీ పార్టీలు చేతులు కలిపినప్పటికీ ఎన్డీఏ 64 స్థానాలు గెలుచుకుంది. ఈసారి సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ చేరువై అద్భుత విజయాలు నమోదు చేశాయి.
వారిది సూపర్‌ హిట్‌ జోడీ
దేశవ్యాప్తంగా ముస్లింలు ఏకపక్షంగా ఇండియా కూటమికి ఓటేయడంతో బీజేపీ చావు దెబ్బలు తిన్నది. యూపీలో రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ జోడీ సూపర్‌ హిట్‌ కొట్టింది. ఈ జోడీ కలిసే ప్రచారం చేసింది. ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని, పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు అంతమవుతాయని, నియంతృత్వం వస్తుందని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ప్రజల్లో ఆలోచనలు రేపింది. బీజేపీని తొలగించి దేశాన్ని రక్షించండంటూ ఇచ్చిన నినాదం ఓటర్లపై ప్రభావం చూపింది. తరచుగా ఉద్యోగ నియామక పరీక్షా పత్రాలు లీక్‌ కావడం యువతలో ఆగ్రహాన్ని కలిగించింది. రాజకీయంగా దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీకి సీట్లు తగ్గడం ఆ పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణమైంది. అగ్నిపథ్‌ పథకాన్ని రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారాంశంగా మార్చేశారు. అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. పేపర్‌ లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలను అఖిలేష్‌, రాహుల్‌ తమ ఎన్నికల ప్రచార సభల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా యువతలో ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో మలచుకునేందుకు శాయశక్తులా కృషి చేశారు.
ఫిరాయింపుదారులకు పెద్ద పీట
నరేంద్ర మోడీ పేరుతోనే ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యంకాదని ఫలితాలు నిరూపించాయి. ‘బ్రాండ్‌ మోడీ’ మెరుపు మసకబారింది. ప్రధాని మోడీ సైతం గత ఎన్నికలతో  పోలిస్తే వారణాసిలో తక్కువ మెజారిటీతోనే విజయం సాధించారు. స్థానికంగా అభ్యర్థుల పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం బీజేపీకి భారీ నష్టాన్ని మిగిల్చింది. సిట్టింగ్‌ ఎంపీల పట్ల  ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని గ్రహించిన బీజేపీ నాయకత్వం వారిలో పలువురికి టిక్కెట్లు నిరాకరించింది. అదే సమయంలో ఫిరాయింపుదారులకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు ఇచ్చింది.  ప్రతి నలుగురు బీజేపీ అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఫలితంగా ఆ పార్టీ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఈ రాష్ట్రాలే కారణం
మధ్యప్రదేశ్‌, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అద్భుత పనితీరు కనబరచినా, కేరళలో బోణీ కొట్టినా గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ బలం పడిపోయింది. దీనికి కారణం…ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో దెబ్బతినడమే. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌లో సైతం బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేయలేకపోయింది. 2014,  2019 ఎన్నికల్లో గుజరాత్‌లోని అన్ని స్థానాలనూ కాషాయ పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Spread the love