– ఫిషరీస్ చైర్మెన్ పిట్టల రవీందర్ ‘మత్స్యదర్శిని’ సందర్శన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ‘ఫిషరీస్ ఫెడరేషన్’ నెలకొల్పిన మత్స్యదర్శిని కేంద్రాన్ని ఆ ఫెడరేషన్ చైర్మెన్ పిట్టల రవీందర్ శనివారం సందర్శించారు. మత్స్యదర్శిని నిర్వహణకు సంబంధించిన వివరాలను ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గట్టుపల్లి సుజాత ఆయన వివరించారు. సెల్లార్తోపాటు రెండు అంతస్తుల్లో నిర్మించిన మత్స్యదర్శిని భవన సముదాయాన్ని చైర్మెన్ తిరిగి పరిశీలించారు. ఆ భవనంలో నిరుపయోగంగా పడి ఉన్న మొదటి అంతస్తు భవనాన్ని వినియోగించుకుని అధునాతనమైన ”ఫిస్టారెంట్”ను నిర్వహించేందుకు గల అవకాశాలను ఆయన పరిశీలించారు. రాజధాని నగరంలో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్లో ఫిషరీస్ ఫెడరేషన్ ఆధీనంలో ఉన్న సొంత భవన సముదాయానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసి పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.