– తొలి టెస్టుకు ఎర్రమట్టి పిచ్ సిద్ధం
– తుది జట్టు కూర్పుపై తర్జనభర్జన
చెన్నై చెపాక్ పిచ్ అంటేనే స్పిన్ స్వర్గధామం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో సైతం ఇక్కడ బంతి గిర్రున తిరుగగా.. ఐదు రోజుల ఆటలో స్పిన్ మాయజాలం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?!. అంచనాలకు భిన్నంగా భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టుకు చెపాక్‌లో పేస్ పిచ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. తొలి టెస్టు సవాల్‌కు ఎర్రమట్టితో పిచ్‌ను సిద్ధం చేయగా.. భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ముగ్గురు పేసర్లు లేదా ముగ్గురు స్పిన్నర్లు? రోహిత్ శర్మ, గౌతం గంభీర్‌కు ఇప్పుడు తుది జట్టు కూర్పు తలనొప్పి షురూ కానుంది. భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు గురువారం నుంచి ఆరంభం కానుండగా.. చెపాక్ క్యూరేటర్ ఎర్రమట్టితో తయారు చేసిన పేస్‌కు అనుకూలించే వికెట్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఎర్రమట్టి పిచ్‌పై నాణ్యమైన బౌన్స్, పేస్‌తో పాటు బంతి పాడిన తర్వాత రివర్స్ స్వింగ్ సైతం లభించనుంది. దీంతో ఐదు రోజుల ఆటలో పేసర్లు ప్రభావం చూపించనున్నారు. దీంతో తుది జట్టులోకి ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలా? లేదా ముగ్గురు పేసర్లను ఎంచుకోవాలనే అనే డైలామా ఇప్పుడు జట్టు మేనేజ్‌మెంట్‌కు తీయని తలనొప్పి తీసుకొచ్చింది.
ఐదుగురు బౌలర్ల ఫార్ములా
టెస్టుల్లో భారత్ ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. ఈ ఫార్ములాలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు బౌలింగ్ విభాగంలో కచ్చితంగా ఉండనున్నారు. ఐదో స్థానం కోసం స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సహా పేసర్లు ఆకాశ్ దీప్, యశ్ దయాళ్ పోటీపడుతున్నారు. చివరగా భారత్ ఓ స్వదేశీ టెస్టులో ముగ్గురు పేసర్లతో ఆడటం సైతం బంగ్లాదేశ్‌పైనే కావటం గమనార్హం. 2019 కోల్‌కత డే నైట్ టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లను ఎంచుకుంది. ఆతిథ్య జట్లు ఎప్పుడూ పరిస్థితులు, బలానికి అనుగుణంగా బౌలింగ్ కూర్పును ఎంచుకుంటాయి. భారత్ విషయంలో స్వదేశంలో తిరుగులేని ఫార్ములా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు.
కంగారూపై కన్నేసి..
ముగ్గురు పేసర్లను ఎంచుకోవాలనే తహతహకు మరో కారణం లేకపోలేదు. ఈ ఏడాది ఆఖర్లో రోహిత్‌సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఈసారి ఏకంగా ఐదు టెస్టులు ఆడనుంది. అందుకే, స్వదేశంలో సైతం పిచ్‌లను సైతం పేస్‌కు అనుకూలంగా కోరుకుంటోంది. ఆసీస్‌తో సిరీస్‌కు సన్నాహకంగా ఇక్కడ్నుంచే పేస్ దళానికి పదును పెట్టాలని అనుకుంటోంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లను అందుకు వేదిక చేసుకునే ఆలోచనలో భారత్ ఉంది. సీనియర్ పేసర్ మహ్మద్ షమి పూర్తి ఫిట్‌నెస్ సాధించటంపై దృష్టి సారించాడు. ఆసీస్‌తో సిరీస్‌కు షమి అందుబాటులోకి రానున్నాడు. కానీ బెంచ్‌పై నాణ్యమైన మరో ఇద్దరు పేసర్లు ఉండాలనేది టీమ్ ఇండియా ప్రణాళిక. దీంతో యశ్ దయాల్, ఆకాశ్ దీప్‌లలో ఒకరు అవకాశం దక్కించుకునే వీలుంది.
ఎర్రమట్టి పిచ్
కరొనా మహమ్మారి సమయంలో 2021లో భారత్, ఇంగ్లాండ్ చెన్నైలో రెండు టెస్టులు ఆడాయి. బయో బబుల్ వాతావరణంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందగా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చెపాక్ క్యూరేటర్ రెండు టెస్టులకు భిన్నమైన పిచ్‌లను అందించాడు. తొలి టెస్టుకు ఎర్రమట్టి పిచ్‌ను సిద్ధం చేయగా.. రెండో టెస్టుకు పిచ్‌కు దిగువ లేయర్‌గా మాత్రమే ఎర్రమట్టిని వినియోగించాడు. పిచ్‌కు ఎగువ లేయర్లలో నల్ల మట్టిని వినియోగించాడు. దీంతో పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్నర్ల వేటకు మార్గం సుగమం అయ్యింది. ఎర్రమట్టి పిచ్ ఐదు రోజుల పాటు పగుళ్లు లేకుండా పేసర్లకు అనుకూలిస్తుంది. చెపాక్‌లో తొమ్మిది పిచ్‌లు ఉండగా..అందులో మూడు పిచ్‌లను ముంబయి నుంచి తెప్పించిన ప్రత్యేకమైన ఎర్రమట్టితో తయారు చేశారు. భారత బ్యాటర్లు ఎర్రమట్టి పిచ్‌పై సాధన చేయగా.. బంగ్లాదేశ్ బ్యాటర్లు నల్ల మట్టి పిచ్‌పై ప్రాక్టీస్ చేశారు. భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు వేదిక కాన్పూర్‌లో సహజసిద్ధ ఎర్రమట్టి పిచ్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో భారత్ ముగ్గురు పేసర్లతో ఆడాలని అనుకుంటే చెన్నై టెస్టులోనే సాధ్యపడనుంది.