పహాడీ చిత్రం

Pahadi movieక్రీ.శ.17వ శతాబ్దంలో మొదలై, క్రీ.శ. 19వ శతాబ్దం వరకూ వృద్ధి చెంది హిమాచల్‌ ప్రదేశ్‌లోని గఢవాల్‌, చంబా మొదలగు కొండ ప్రాంతాలలో వేయబడ్డ చిత్రాలను ‘పహాడీ చిత్రం’ అని అంటాం. అక్కడి ప్రాంతీయ ప్రకృతి సౌందర్యం ఈ చిత్రాలలో ప్రతిబింబిస్తుంది. మధ్య యుగాల నాటి పురాణ ఇతిహాసాలు, భక్తి సంప్రదాయ సాహిత్యాలను విషయాలుగా ఎంచుకుని చిత్రించారు ఇక్కడి చిత్రకారులు. మనసులో మెదిలే కలనో, లేక సంగీత రాగాల సౌందర్యాలనో గుర్తుకు తెస్తాయి ఈ చిత్రాలు. మొత్తం మీద ఇవి చాలా అందమైన లఘు చిత్రాలు.
రాజస్థాన్‌, మధ్యభారతం, బెంగాల్‌ నుండి రాజపుత్‌ రాజ కుటుంబాలు వలస వచ్చి ఈ ఉత్తర భారతంలోని కొండపాత్రాలలో స్థిరపడ్డారు. తుర్కుల, మొగలుల తాకిడి నుండి వీరు ఇక్కడ దూరంగా వుండగలిగారు. రాజస్థాన్‌ ఆస్థానాలపై వున్నంత మొగలుల తాకిడి వీరికి లేదు. వీరు తమ హైందవ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఇక్కడ అవకాశం వుండేది. అయినప్పటికీ అక్బర్‌ కాలం నుండి ఈ పహాడీ ఆస్థాన రాజులందరూ మొగలుల సామంతులైనారు. క్రీ.శ. 1618 లో కాంగ్రా అనే పహాడీ ప్రాంత రాజుని ఓడించి తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు జహంగీర్‌. ఒక సంవత్సరం తరువాత కాంగ్రాలో మసీదు నిర్మించారు. క్రీ.శ. 1656లో ప్రీత్‌ పాల్‌షా అనే గఢ్‌వాల కొండిపాంతపు రాజు మొగలులకి లొంగిపోయి కప్పం కట్టడమే కాక తన కొడుకుని మొగలు ఆస్థానంలో సేవలందించటానికి పంపాడు.
పహాడీ ఆస్థానాలలో హిందూ సంప్రదాయ, సాహిత్య కళలే చిత్రించారు. పహాడి చిత్రం వెలువడిన ముఖ్య కేంద్రాలు, రవి నది ఒడ్డున వున్న బషోలీ, చంబా, జస్రోతా. తావి నది తూర్పున మాన్‌కోట, జమ్ము, వనగంగ నది ఒడ్డున హరిపుత్‌ గులేర్‌, కాంగ్రా, తూర్పున మండి, కులు. అలకనందా నది ఒడ్డున తెహరీగఢ్‌వాల్‌. పహాడీ ఆస్థానాల్లో పని చేసే చిత్రకారులని తరఖాన్‌ చితరాలు అంటారు. వారు వడ్రంగి పని చేసే సంప్రదాయ కుటుంబాలు. వారు చెక్కపనితో పాటు లోహపు పని, ఆభరణాల నగిషీ, భవన నిర్మాణాల పనిలోనూ నిపుణులు. ఇక్కడి రాజులు మొగలు ఆస్థాన గొప్ప చిత్రకారులను ఆహ్వానించడం కంటే తమ ప్రాంతపు చితరాలను పిలవడానికే నిర్ణయించుకున్నారు. ఈ తరఖాన్‌ చితరాల కుటుంబాలలో పిన్నవారికి వారి తాతలు తండ్రులు ఎంతో క్రమబద్ధంగా చిత్రలేఖన శిక్షణ ఇచ్చేవారు. చిత్రలేఖనంతో పాటు వారు హిందూ పురాణేతిహాసాలను కూడా తెలుసుకుని వుండాలి. ఒకసారి వేసిన రేఖా చిత్రాన్ని సమయానుసారంగా కొత్త పంథాలో ఆ చిత్రాన్ని మార్పు చేయగల నేర్పు వుండేది ఈ చిత్రకారులకి.
హిందూ భక్తి సంప్రదాయ కథలు ఎక్కువగా చిత్రించేవారు ఈ పహాడి చిత్రకారులు. కృష్ణుడి కథలెక్కువగా చిత్రించారు. ఆ ప్రాంతపు కొండలు, పారే నదులు, నీటి పాయలతో పాటు చిత్రించే పచ్చిక బయళ్లు, రకరకాల రంగులపూలు, తీగలు, అందమైన పొదల వంటి వృక్షాలు మధుర, బృందావనాన్ని గుర్తుకు తెస్తాయి. ఆ ప్రకృతి, అందులోని రాధాకృష్ణుల శృంగార కథలని మలచడానికి తోడ్పడేవి. ఈ చిత్రాలు ఒక ప్రత్యేకత కలిగి వుండి ఇవి పహాడి చిత్రాలు అని వెంటనే గుర్తు పట్టవచ్చు. ఈ చిత్రాలు ఒక నాజూకైన అనురాగ ప్రపంచంలా వుంటాయి. మనుషులు, వన్యమృగాలు చెలియలు. ప్రతీ స్త్రీ, పురుషులు ఎంతో అందమైనవారు. ‘ఇది నిజమే’ అనిపించే కలలాంటి చిత్రాలివి.
ఈ చిత్రాలపై చిత్రకారుడిపేరు, కళాకారులని ఆదరించిన రాజుల పేర్లు చిత్రాలపై రాయడం వారికి ముఖ్యం కాదు. చిత్రమే ప్రాముఖ్యం. వారి చిత్రం చూసి ఆనందించే రసికుల కోసం ఎదురు చూసేవారు చిత్రకారులు. బి.ఎన్‌.గోస్వామి, ఇ.ఫిషర్‌ అనే ఇద్దరు కళాచరిత్రకారులు ఒక పహాడి చిత్రకారుడి కథ ఒకటి నమోదు చేశారు. ఆ కథ ప్రకారం ఒక పహాడీ చిత్రకారుడు, తన మన:పూర్వకంగా ‘స్వాధీన పతిక’ అనే కథానాయిక చిత్రం చిత్రించాడు. ఆమె ప్రియుడు ఆమెకు పూర్తిగా అధీనుడు. ఈ చిత్రం తీసుకుని ఆ చిత్రకారుడు ఒక రాజు ఆస్థానం చేరగా ఆ రాజు ఆ చిత్రం చూసి ఆ చిత్రంలోని విషయం అర్ధం అవగానే వెంటనే తన పక్కన వున్న తన రాజదర్బారు అనుచరులకివ్వగా అందరూ ఆ చిత్రం బాగుందని ప్రశంసించారు. అంతట రాజు తన అనుచరుడితో కళాకారుడికి వంద రూకలిచ్చి ఆ చిత్రం తీసుకోమన్నాడు. ఆ రాజు కదలికలని గమనిస్తున్న చిత్రకారుడు నిరాశ చెందగా, రాజు అంతకు రెండింతలు పైకం ఇవ్వమని చెప్పినా నిరాశ చెందిన చిత్రకారుడు, తను ఆ చిత్రం అమ్మదలచుకోలేదని వెనక్కి తీసుకున్నాడు. తను ఎంతో సమయం వెచ్చించి శ్రద్దగా వేసిన చిత్రంలోని ఒక నాజూకు విషయాన్ని రాజు గమనించనేలేదని, ఆ చిత్రకారుడు నిరాశ చెందాడు. రాజుకు కోపం వస్తుందనే భీతి కూడా లేకుండా తన చిత్రం ఒక గుడ్డ సంచిలో చుట్టుకుని వెనుదిరిగాడు. బజారులో నడిచి వెళుతుండగా ఒక దుకాణంలో నగలు అమ్మే స్వర్ణకారుడు ఇతనిని ఆపి, ఆ చిత్రం అడిగి చూసి మురిసిపోతూ ఆ చిత్రాన్ని చూస్తుండిపోయాడు. చివరికి చేతులు జోడించి నీవెంత గొప్ప చిత్రకారుడవని ప్రశంసించాడు. చిత్రకారుడు ఆశ్చర్యపోయి, నీవా చిత్రంలో ఏమి చూశావని అడుగగా, ఆ స్వర్ణకారుడు, తను ఇప్పటి వరకూ ఎన్నో స్వాధీనపత్రిక చిత్రాలు చూశాననీ, ఈ చిత్రంలోని నాజూకుతనం వేరెక్కడా చూడలేదని జవాబిచ్చాడు. ఆ చిత్రంలోని పురుషుడు చేతిలో విచ్చిన గులాబి చేతబట్టి ఆ స్త్రీ లేదా నాయిక పాదం ఒత్తుతుంటాడు. తన చేయి గట్టిదనంతో ఆమె పాదం నెప్పి పుడుతుందని, గులాబితో వత్తినా అది కూడా ఆమెకు నెప్పి కలిగినట్టుగా, తన నాజూకైన చేయి చాచి వద్దని వారిస్తోంది. అది విన్న చిత్రాకారుడికి సంబ్రమాశ్చర్యాలు కలిగాయి. ఈ నాజుకు స్పందన తీసుకురావటమే ఆ చిత్రకారుడు ఈ చిత్రంలో తెచ్చిన వైవిధ్యం. ఆ స్వర్ణకారుడు నిజమైన రసికుడని అర్థం చేసుకున్న చిత్రకారుడు, అతనికి వంగి నమస్కరించి, ఆ చిత్రంతో పాటు ఎదురు బహుమానం ఇచ్చి వెళ్లిపోయాడు.
రాజస్థానీ చిత్రాలకూ, పహాడి చిత్రాలకూ కొంత పోలిక కనిపిస్తుంది. వారూ, వీరూ భారతీయ పురాణేతిహాస చిత్రాలే వేశారు. వీరూ తాళపత్ర గ్రంథాలపై శ్లోకాలకు చిత్రాలు చిత్రించారు. పహాడి చిత్రాలకు ముందట సామాన్య అంచులు దిద్దినా తరువాత ఎంతో నగిషీలు తీర్చిదిద్దారు. రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం, జయదేవుని గీత గోవిందం ముఖ్య విషయాలుగా చిత్రించారు. అలాగే శృంగార సాహిత్యంలో భానుదత్తుడు రాసిన రసమంజరి, కేశవదాసు రాసిన రసికప్రియ, కవిప్రియ, అలాగే బీహారి సత్‌సాయి ‘నాయక – నాయిక’ కథాభావాలు, 12 మాసాలను వివరించే ‘బారామాసా’, సంగీత రాగాలను వివరించే ‘రాగమాల’ అనే శీర్షిక చిత్రాలు, దేవీమహత్యం, నల దమయంతి, సోనీ-మహీవాల్‌, సస్సి – పున్ను, ప్రేమ కథలు, ఇవన్నీ ఈ చిత్రకారులకి అందమైన చిత్రవిషయాలు. అలాగే రాజుల దర్బారు, వారి అడవిలో వేటాడే దృశ్యాలనూ, వారి పోట్రేటులను కూడా చిత్రించారు.
బషోలీ చిత్రం : బషోలీ చిత్రం పురాతన నామం విష్ణుస్థల. ఇప్పుడు ఇది జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రంలో భాగం. క్రీ.శ.1792 – 1839 ల మధ్య మహారాజా రంజీత్‌ సింగ్‌ సిక్కులపై ఆధిపత్యం సంపాదించి, లాహోర్‌ రాజధానిగా పహాడీ చిత్రాన్ని వృద్ధి చేయించాడు. క్రీ.శ. 17 వ శతాబ్దపు రెండవ భాగంలో రాజా సంగ్రామ్‌ సింగ్‌ పాల్‌ అనే బషోలీరాజు గొప్ప వైష్ణవ భక్తుడు. శైవసాహిత్యాన్ని కూడా చిత్రాలుగా వేయించాడు. అక్కడ భక్తి సాంప్రదాయం ప్రబలటానికి ఇతను ఒక కారకుడు. భానుదత్తుడి రసమంజరి, శృంగార సాహిత్య చిత్రాలూ ఇక్కడ చిత్రించారు. ఇతని మేనల్లుడు, కిర్‌పాల్‌ పాల్‌ కూడా కళలకు ప్రోత్సహం ఇచ్చి గ్రంథాలు చిత్రాలు చిత్రింపజేశాడు. దేవీదాస అనే చిత్రకారుడు కృష్ణుడి చిత్రాలకు ఒక మార్పు తెచ్చి, మానవ సమాజ పురుషుడిలా వేష వస్త్రధారణతో చిత్రించాడు. మనకు అనే చిత్రకారుడు గీత గోవిందం సాహిత్యాన్ని సామాన్య రంగులు రేఖలతోనే ఆకర్షణీయంగా చిత్రించాడు. పహాడి ఆస్థానాల మధ్య జరిగిన వివాహ సంబంధాల వలన ఒకరి ఆస్థాన చిత్రాలు మరొకరికి చేరి, చిత్రీకరణ పద్ధతులు ఒకరికొకరు నేర్చుకున్నారు.
కులు ఆస్థానం : వీరి చిత్రంలో బషోలీ చిత్రఛాయలు కనిపిస్తాయి. వీరు వైష్ణవులు. రఘునాథుడు పేరుతో రాముడు వీరి కులదైవం. వీరు రాముడి వంశం వారని నమ్ముతారు. ఈ ఆస్థానంలో చిత్రించిన రామాయణం, క్రీ.శ 19వ శతాబ్దంలో షాంగ్రీ అనే ప్రదేశంలో దొరకటంతో ఇది షాంగ్రీ రామాయణంగా పేరు పడింది. ఇది భావయుక్త చిత్రాలతో గుంపులుగా ఎన్నో ఆకారాలు చిత్రించిన చిత్రసంపుటి. దీని తరువాత వేసిన భాగవత పురాణ చిత్రశైలి కొంచెం వేరుగా వుంటుంది.
గులేర్‌ : బనగంగ ఒడ్డున వున్న చిన్న ఆస్థానం. కాంగ్రా ప్రాంతానికి చెందిన రాజా హరిచంద్‌ అడవిలో వేటకి వెళ్లి దారి తప్పి బావిలో పడిపోయాడు. అతని అనుచరులు వెతికి వేసారి, కనపడక అతను మరణించాడని వార్త తెలిపారు. అతను బతికాడు. కానీ తిరిగి వెళ్లి మళ్లీ సింహాసనం అడగకుండా, అక్కడే హరిపురాన్ని రాజధానిగా చేసుకుని తన కొత్త ఆస్థానం నిర్మించుకున్నాడు. కొన్ని పోట్రేటులతో పాటు, రామాయణం ఇక్కడ చిత్రించబడింది. తరువాత ఇక్కడ సిక్కుల అధికారం పెరిగి చిత్రకళ అడుగంటింది. కాంగ్రా : ఆ పహాడీ ప్రాంతంలో మరో లోకపు ప్రకృతి సౌందర్యం నిండి వున్న ప్రాంతం ఇది. ఇక్కడి వారి మాట ప్రకారం, ఎవరు కాంగ్రా కోటకు అధిపతులో వారే ఆ పహాడీ ప్రాంతానికి అధిపతులూ అనే మాట, సామెత అయింది. ఇక్కడి చిత్రాలూ అంతే అందంగా చిత్రించారు. అక్కడి ప్రకృతే చిత్రకారులకు ప్రేరణ. అందమైన లతలు, పూలు, గుండ్రటి కొండలు, ఎంతో అందంగా చిత్రించిన స్త్రీ, పురుష రూపాలు దోబూచులాడే పొదలు, ఇది కాంగ్రా చిత్రం అని అన్నింటి మధ్య వున్నా పట్టి బయటకు తీయవచ్చు. భాగవత పురాణం, గీత గోవిందం, రాధా కృష్ణుల శృంగార చిత్రాలు, రామాయణం బారామాసా, రాగమాల వీరి ముఖ్య చిత్ర విషయాలు కాగా, కొన్ని దర్బారు దృశ్యాలూ చిత్రించారు. చంబా : హిమాలయ పాదాల వద్ద వున్న పెద్ద రాష్ట్రం ఇది. క్రీ.శ. 18వ శతాబ్దంలో చంబా, గులేర్‌ మధ్య జరిగిన వివాహ సంబంధాల వలన చిత్రకారులు అటు వారు ఇటు, ఇటు వారు అటూ ప్రయాణం చేశారు. అందువలన చంబా చిత్రాలలో గులేర్‌ శైలి కన్పించడం మొదలుపెట్టింది. చంబా చిత్రాలలో అలంకరణకు గొప్ప స్థానం ఇచ్చారు. వీరు రుమాళ్ల పై చేసిన కుట్టుపని, చిత్రాలు చిత్రించారేమో అన్నంత అందంగా వుంటుంది.
మండి : క్రీ.శ. 10, 11 వ శతాబ్దాలలో బెంగాల్‌ నుండి పాల వంశీయులు ఈ ఆస్థానం నిర్మించినా ముందర గొప్ప చిత్రం జరుగలేదు. క్రీ.శ. 17వ శతాబ్దంలో మొగలు చిత్రకారుడెవరో ఇక్కడ చేరి మండి చిత్రానికి ఒక శైలి తెచ్చాడు.
గఢ్‌వాల్‌ : క్రీ.శ. 1785 – 1804 వరకూ పాలించిన రాజా ప్రద్యుమన్‌ షా కాలంలో చెప్పుకోదగ్గ చిత్రాలు వెలువడ్డాయి. కాంగ్రా ఆస్థానంతో ఈ రాజుల కుటుంబాలకు వివాహ సంబంధాలు ఏర్పడ్డాక ఇక్కడ గులేర్‌, కాంగ్రా శైలిని పోలిన చిత్రాలు వెలువడ్డాయి.
ఈ పహాడీ రాజ్యాలు హిందూ సంస్కృతిని నిలుపుకోటానికి మొగలు, ముస్లిం రాజులనుండి దూరంగా వుండగలిగారు గానీ, చాపకింద నీరులా దేశమంతా పారిన బ్రిటీష్‌ వారి రాకని ఆపలేకపోయారు. క్రీ.శ. 18వ శతాబ్దంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరు మీద వ్యాపార నిమిత్తం భారతదేశం చేరిన బ్రిటీష్‌వారి వలన దేశమంతా విచ్ఛిన్నమైంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు, లేదా రెండు పిల్లుల మధ్య తగవులు పెట్టి, మధ్యన దూరి భారతీయ ప్రాంతాలన్నీ చేజిక్కించుకున్నారు. బ్రిటీష్‌వారు మన దేశాన్ని వారి కిరీటంలో ఒక నగిషీ రాయిని చేసుకున్నారు. వారు వారి దేశం నుండే కళాకారును, కళలనూ తీసుకువచ్చి మనదేశంలో కొత్త రీతులను ప్రవేశపెట్టారు. ఆ కళలను ఆధునిక కళలుగా పేరు పెట్టి మన దేశంలో కళాకారులకు, నేర్పించడం మొదలుపెట్టారు. మన కళాకారులను వారి చిత్రాలు చిత్రించే వుద్యోగులుగా చేర్చుకున్నారు. భారతీయ సంస్కృతి, జీవన శైలికి అద్దం పట్టిన భారతీయ సంప్రదాయ కళా ప్రవాహంలో కలిపిన రంగుకి అద్దంలోనూ ప్రతిమ రంగు మారింది. భారతీయ కళల కథ కంచికి చేరింది.

– డా||యమ్‌.బాలామణి, 8106713356

Spread the love