నవతెలంగాణ – పాకిస్థాన్
ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ వేదిక విషయంలో పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రపంచకప్ కోసం అక్టోబరు-నవంబరులో పాక్ జట్టు భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. అక్టోబరు 15న భారత్-పాక్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటనకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీబీసీ) సహా సభ్య దేశాలను ప్రతిపాదిత ప్రయాణ ప్రణాళికపై సలహాలు కోరింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మ్యాచ్‌లను షెడ్యూల్ చేసిన వేదికలను ఆమోదించే పనిని బోర్డు డేటా, అనలిటిక్స్, టీమ్ స్ట్రాటజీ నిపుణులకు పీసీబీ అప్పగించింది. ఈ క్రమంలో చెన్నైలో పాకిస్థాన్, బెంగళూరుతో ఆస్ట్రేలియాతో తలపడే విషయంలో పాకిస్థాన్ సెలక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రషీద్‌ఖాన్, నూర్ అహ్మద్ వంటి ప్రపంచస్థాయి స్పిన్నర్లు ఉన్న అఫ్ఘనిస్థాన్‌తో స్పిన్‌కు అనుకూలించే చెన్నై పిచ్‌పై ఆడడం, బ్యాటింగ్‌కు అనుకూలించే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడాల్సి వస్తే అంగీకరించవద్దని పీసీబీకి సెలక్టర్లు సూచించినట్టు సమాచారం. కాబట్టి ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌ను బెంగళూరులోను, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ను చెన్నైలో ఆడేలా రీషెడ్యూల్ చేయాలని ఐసీసీ/బీసీసీఐని కోరినట్టు తెలుస్తోంది. ప్రొటోకాల్‌లో భాగంగానే సభ్య దేశాలను ఐసీసీ సలహాలు కోరిందని, వేదికలు మార్చాలంటే బలమైన కారణం ఉండాల్సిందేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ తలపడే వేదికల మార్పు విషయంలో సందిగ్ధత నెలకొంది.