పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల..

Palamuru-Ranga Reddy will rise..– ప్రజల కష్టాలను తీర్చే ప్రాజెక్టు
– గొప్ప సంబురాలు చేయాలి : మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకం ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్‌, పి. సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఒకనాడు వలసలతో పడావుపడ్డ పాలమూరు జిల్లాను, ఈ ప్రాజెక్టు పచ్చగా చేస్తుందని పేర్కొన్నారు. ప్రతియేటా లక్షలాది మంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి గతంలో ఉండేదనీ, కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తామని వివరించారు. గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం, కష్ణా బేసిన్‌లో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టిందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతప్తికరంగా పూర్తయినట్టేనని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూస్తుంటే, కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతదేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉందన్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇది అని స్పష్టం చేశారు. అనేక అడ్డంకులను దాటుకుని పూర్తయిన ప్రాజెక్టు ఇదని తెలిపారు. రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇంత గొప్ప సందర్భాన్ని సంతోషంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలని సూచించారు. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ జరుగుతుందని వ్యాఖ్యానించారు.

Spread the love