పాలేరులో పొంగులేటి…! ఖమ్మంలో తుమ్మల…!!

– మధిర, భద్రాచలం సిట్టింగ్‌ అభ్యర్థుల వైపే మొగ్గు
– మిగిలిన నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
– ఇల్లందు అభ్యర్థి నిర్ధారణకు కాంగ్రెస్‌ సీక్రెట్‌ సర్వే
– నిన్న, ఇవ్వాళ ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో కొనసాగుతున్న స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారని సమాచారం. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, మధిర, భద్రాచలం సిట్టింగ్‌ అభ్యర్థులు భట్టి విక్రమార్క, పోదెం వీరయ్యకు టిక్కెట్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మిగిలిన ఆరు నియోజకవర్గాల అభ్యర్థులను తదుపరి జాబితాల్లో ప్రకటిస్తారు.
అంచనాలను తలకిందులు చేస్తూ….
తుమ్మల పార్టీలో చేరతారనే ఊహగానాలు మొదలయి నప్పటి నుంచి పాలేరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీతోనే ఆయన పార్టీలో చేరారని ఆయన అనుచరులు ప్రచారం చేశారు. కానీ ఆ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వే, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల పరిస్థితులు, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటిని నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో పాలేరు, ఖమ్మం కాకుండా కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ చేస్తారనే చర్చ కొనసాగింది. పొంగులేటి సైతం ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పార్టీ మాత్రం పాలేరు నుంచే శ్రీనివాసరెడ్డిని దించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగూడెం సీటును సంప్రదాయంగా వస్తున్న బీసీలకు కేటాయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇల్లందు అభ్యర్థి నిర్ధారణపై
కాంగ్రెస్‌ సీక్రెట్‌ సర్వే…
ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ కోసం 36 మంది దరఖాస్తు చేసుకున్న ఇల్లెందు నియోజకవర్గం అభ్యర్థి నిర్ధారణపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థిగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్‌, గతంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కోరం కనకయ్యకు టిక్కెట్‌ కేటాయిస్తారని భావించారు. 36 మంది ఇల్లందు టిక్కెట్‌ ఆశిస్తున్నా పొంగులేటి అనుచరుడు కోరం కనకయ్యకే మెరుగైన అవకాశాలు ఉండవచ్చని అంచనా వేశారు. తొలి జాబితాలోనే ఆయన పేరు ఉంటుందని అనుకున్నా… కనకయ్య పేరు తొలి విడత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కనకయ్య పార్టీ ఫిరాయించారు. ఈసారి కూడా పార్టీ అధికారంలోకి రాకపోతే ఆయన పార్టీ వీడతారని పార్టీలో కనకయ్య పోటీదారులు ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం డైలామాలో పడ్డట్లు తెలుస్తోంది. కోరం కనకయ్య కాకుండా అక్కడ నుంచి పోటీ చేస్తే ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువనే విషయంపై పార్టీ సీక్రెట్‌ సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఆ సర్వేలో తేలే ఫలితం ఆధారంగానే ఇల్లందు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల కోసం తర్జన భర్జన….
నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులపై ఓ స్పష్టతకు వచ్చిన అధిష్టానం…మిగిలిన ఆరు స్థానాలు పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, వైరా, ఇల్లందు, సత్తుపల్లి నుంచి ఎవరిని బరిలో నిలపాలనే అంశంపౖౖె తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్‌ ఆశించే వారి సంఖ్య ఈ నియోజకవర్గాల నుంచి అధికంగా ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను తొలుత షార్ట్‌ లిస్ట్‌ చేసి తదనంతరం అంతర్గత సర్వే ఆధారంగా ప్రకటించే చాన్స్‌ ఉంది.
నేడు కూడా కొనసాగనున్న స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం…
స్క్రీనింగ్‌ కమిటీ చైైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ప్రారంభమైన సమావేశం రెండోరోజు గురువారం కూడా కొనసాగనుంది. తొలిరోజు సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు పాల్గొన్నారు. తొలిరోజే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థుల జాబితాలో కొన్ని సీట్లలో స్పష్టత రాగా, రెండోరోజు నిర్వహించే సమావేశంలో మిగిలిన ఆరు నియోజకవర్గాలకు గానూ ఒకటి, రెండు స్థానాల అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Spread the love