– వాటికి నెంబరింగ్ వేయాలి
– నరికితే మూడేండ్ల జైలు శిక్ష
– టీసీఎస్, టీఎఫ్‌టీ కొత్త లైసెన్స్‌లు
– గీత కార్మికులకు చెట్టు ఎక్కేందుకు
ఆధునిక సేఫ్టీ యంత్రాలు : అబ్కారీ శాఖ సమీక్షాసమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కల్లు దుకాణాల తరలింపు, రద్దు చేసిన కల్లు దుకాణాల పునరుద్ధరణ అనేది క్షేత్ర స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలి. గీత కార్మికులకు తాటి చెట్టు ఎక్కేందుకు ఆధునిక సేఫ్టీ యంత్రాలను అందించాలి. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత, ఖర్జూర, గిరకతాటి చెట్లను పెంచాలి. చెట్లకు నెంబరింగ్‌ను వేయాలి.వాటిని నరికితే మూడేండ్ల కఠిన కారాగార శిక్షతోపా టు జరిమానా ఉంటుంది. టీసీఎస్, టీఎఫ్‌టీలకు సంబంధించిన కొత్త లైసెన్స్‌లు మంజూరు చేయాలి. మెజార్టీ సభ్యుల అంగీకారంతో టీఎఫ్‌టీని టీసీఎస్‌గా మార్చుకోవచ్చు’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో సచివాలయంలోని తన కార్యాలయంలో సంబం ధిత అధికారులతో బుధవారం మంత్రి ఉన్నత స్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరకతాటి చెట్లకు నెంబరింగ్‌ను ఆగష్టు31 వరకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని, నరికినవారికి కనీసం మూడేండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు జరిమానా విధించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్ గజ్జెల నగేష్, ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మమ్మద్ ముషారఫ్ ఫారూకి, అదనపు కమిషనర్ అజరుకుమార్, అధికారులు పాల్గొన్నారు.