– జాతీయ అవార్డుల వెనుక పంచాయతీ కార్మికుల కష్టం : బాజిరెడ్డి
– ఐకేపీ వీఓఏల సమస్యలనూ పరిష్కరించాలని సభ్యుల వేడుకోలు
– వీఓఏ, జీపీ కార్మికుల సమస్యను సీరియస్‌గా తీసుకుంటున్నాం :మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికార, ప్రతిపక్ష సభ్యులందరి నోట ఒకటే మాట…
తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన గ్రామ పంచాయతీ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాల్సిందేనని అసెంబ్లీలో పలువురు అధికార, ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే తరహాలో ఐకేపీ వీవోఏల కొలువులను సైతం క్రమబద్ధీకరించాలని వారు కోరారు. వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే రూలింగ్, అపోజీషన్ సభ్యులందరి నోట… ఈ రెండు అంశాలపై మాత్రం ఒకే మాట వెలువడటం గమనార్హం. శనివారం శాసనసభ జీరో అవర్‌లో 14 మంది సభ్యులు పంచాయతీ కార్మికుల సమ్మె, వారి పర్మినెంట్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఐకేపీ వీవోఏల సమస్యలను కూడా ఎక్కువ మంది సభ్యులు ఏకరువు పెట్టారు. పల్లె ప్రగతిపై లఘు చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు… ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. ఆయన్ను, పీసీసీ చీఫ్ రేవంత్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా మొత్తం ఐదు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. మరోవైపు శాసన మండలిలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి… ఐటీడీఏలు, పోడు భూముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మణిపూర్‌లో ప్రభుత్వ ప్రాయోజిత హింస కొనసాగుతోందంటూ బీఆర్ఎస్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు శాసనసభ, అటు మండలి… ఆదివారానికి వాయిదాపడ్డాయి.
అసెంబ్లీలో శనివారం జీరో అవర్ ఆసాంతం గ్రామ పంచాయతీ కార్మికుల పర్మినెంట్, ఐకేపీ వీఓఏల సమస్య పరిష్కారం చుట్టే తిరిగింది. గంట సమయంలో 46 మంది సభ్యులు మాట్లాడగా…అందులో 20 మందికిపైగా ఈ రెండు అంశాలనూ ప్రస్తావించారు. పల్లెప్రగతి సక్సెస్‌లో, జాతీయ అవార్డులను సాధించిపెట్టడంలో పంచాయతీ కార్మికుల కష్టాన్నీ సభ ముందుంచారు. దీనిని బట్టే క్షేత్రస్థాయిలో వారిపై ఎంత ఒత్తిడి ఉందో..గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లతో ఎంత న్యాయముందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సభ్యులంతా ఒకే మాట ఎత్తుకోవడంతో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందిస్తూ.. ఐకేపీ వీఓఏలు, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయనీ, పరిష్కరించే దిశగా ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నదని చెప్పారు. మిషన్‌భగీరథ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, సెకండ్ ఏఎన్ఎమ్, హోంగార్డులు, పశుమిత్రల సమస్యలనూ సభ్యులు ఏకరువు పెట్టారు. దీంతో చివరిరోజైనా తమ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న కొండంత ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.
జీపీ కార్మికుల సమ్మెలో న్యాయం ఉంది : ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్
రాష్ట్రంలో 25 రోజులకు పైగా జీపీ కార్మికులు సమ్మె చేస్తున్నారనీ, అందులో న్యాయముందని ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జీఆరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ..ఇప్పుడు పనిచేస్తున్న జీపీ కార్మికులు 50, 100 రూపాయల దగ్గర నుంచి పనిచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. 2014లో వారి వేతనాన్ని తమ ప్రభుత్వం రూ.3వేలకు, ప్రస్తుతం దాన్ని రూ.9,500కి పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. పల్లెప్రగతి కార్యక్రమం నుంచి వారి కష్టం పెరిగిందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారన్నారు. జీపీ కార్మికుల కష్టం వల్లనే తన నియోజకవర్గంలోని రెండు పంచాయతీలకు జాతీయస్థాయిలో అవార్డులు దక్కాయని సగర్వంగా చెప్పారు. పర్మినెంట్, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
వీఓఏలు, జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి : సీతక్క
పెరిగిన నిత్యావసర ధరలరీత్యా రూ.3,900 వేతనంతో బతకలేక ఐకేపీ వీఓఏలు బతకడం కష్టంగా మారిందనీ, వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంగ్రెస్ సభ్యులు సీతక్క సభను కోరారు. గ్రామపంచాయతీ కార్మికుల పోరాటాన్ని చూస్తుంటే ఆవేదన కలుగుతోందని చెప్పారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తుంటే పట్టదా? అని ప్రశ్నించారు. వారికి న్యాయం చేయాలని కోరారు.
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : రఘునందన్‌రావు
మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న 662 మంది కార్మికులను తొలగించడం బాధాకరమని బీజేపీ సభ్యులు రఘునందన్‌రావు అన్నారు. వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరారు. జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మిషన్‌భగీరథ, జీపీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
గ్రూప్-2 పరీక్షల తేదీలను మార్చండి : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
గ్రూపు-2 పరీక్షను ఆరున్నర లక్షల మంది అభ్యర్థులు రాయబోతున్నారనీ, వారందరికీ న్యాయం చేసేందుకు పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ మార్చేలా చూడాలని కాంగ్రెస్ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. అన్ని పరీక్షలు దగ్గరి తేదీల్లో నిర్వహిస్తుండటం వల్ల వారిపై భారం పడుతున్నదని చెప్పారు. వెంటనే తేదీలను రీషెడ్యూల్ చేయాలని విన్నవించారు. జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, వారికి జీవో 60 ప్రకారం వేతనాలివ్వాలనీ, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలనీ, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు.
మిర్యాలగూడను జిల్లా చేయాలి : భాస్కర్‌రావు
బీఆర్ఎస్ సభ్యులు భాస్కర్‌రావు మాట్లాడుతూ..మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. హోంగార్డులు, ఆశాలు, జీపీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. నాగార్జున సాగర్ నుంచి పంటలకు వెంటనే నీళ్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గొంగిడి సునీత మాట్లాడుతూ..ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని కోరారు. చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..హోంగార్డులను పర్మినెంట్ చేయాలని విన్నవించారు.