ఇజ్రాయిల్‌ అల్టిమేటంతో భయాందోళన

Panic over Israel's ultimatum– గాజాను వీడుతున్న లక్షలాదిమంది ప్రజలు
– పెను విపత్తు అంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరిక
– ఖండించిన పాలస్తీనా నేత అబ్బాస్‌
– పాక్‌, ఆఫ్ఘన్‌, ఇరాక్‌ల్లో పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శనలు
గాజా సిటీ : గాజా ప్రాంతంలోని పాలస్తీనా పౌరులందరూ 24గంటల్లోగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ ఇజ్రాయిల్‌ అల్టిమేటమ్‌ జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర గాజా ప్రాంతాన్ని పలువురు వీడుతున్నారు. ఉత్తర గాజాలో హమాస్‌ తీవ్రవాదులు సొరంగాల్లో దాక్కున్నారని, వారిని పట్టుకునేందుకే ఈ ఆదేశాలు జారీ చేశామని శుక్రవారం ఇజ్రాయిల్‌ రక్షణ బలగాలు (ఐడిఎఫ్‌) తెలిపాయి. దాదాపు సగానికి సగం గాజా ప్రాంతం ఖాళీ అవుతుండడంతో ఐక్యరాజ్య సమితి ఇదొక పెను విపత్తు కాగలదంటూ హెచ్చరించింది. కాగా హమాస్‌ మాత్రం ఇజ్రాయిల్‌ హెచ్చరికలను తోసిపుచ్చుతోంది. ఇదంతా పెద్ద కుట్ర అని, ప్రజలు ఇళ్ళలోనే వుండాలని కోరుతోంది. ఖాళీ చేసేందుకు కేవలం 24గంటలే గడువు ఇచ్చినందున మానవతా సంస్థలు పది లక్షల మందికిపైగా ప్రజల కన్నా సాయం చేయలేవని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ (ఐసిఆర్‌సి) పేర్కొంది. ఇదిలా వుండగా, ఇలా బలవంతపు తరలింపులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పాలస్తీనా అధ్యక్షు డు మహ్మద్‌ అబ్బాస్‌ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌కు తెలిపారు. మానవతా విపత్తును తప్పించడానికి వెంటనే మానవతా కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరారు.
వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ కాల్పులు : 9మంది మృతి
యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాకు సంఘీభావంగా వెస్ట్‌ బ్యాంక్‌లో ర్యాలీలు జరుపుతుండగా ఇజ్రాయిల్‌ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 9మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1799మంది పాలస్తీనియన్లు మరణించగా, 6388మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్‌ వైపు మృతుల సంఖ్య 1300 దాటిందని సైన్యం ప్రకటించింది. 3200మందిక పైగా గాయపడ్డారని తెలిపింది. మరోవైపు గాజాలో వైట్‌ ఫాస్పరస్‌ బాంబులను ఉపయోగిస్తున్నామని వచ్చిన ఆరోపణలను ఇజ్రాయిల్‌ మిలటరీ ఖండించింది.
అవసరమైతే మరింత సాయం చేసేందుకు సంసిద్ధంగా వున్నామంటూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ శుక్రవారం తెలిపారు. కాగా పాలస్తీనియన్లకు మద్దతుగా పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కరాచి, లాహౌర్‌, పెషావర్‌, ఇస్లామాబాద్‌ లతో సహా పలు నగరాలు, పట్టణాల్లో రాజకీయ, మత పరమైన పార్టీలు డజన్ల సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించాయి. బాగ్దాద్‌లో వేలాదిమంది ఇరాకీలు పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు.
వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగిస్తున్న ఇజ్రాయిల్‌
టెల్‌ అవీవ్‌: హమాస్‌ కార్యకర్తల ఏరివేత లక్ష్యంగా గాజాపై ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు గాజాలోని 3,600 హమాస్‌ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు రోజుల్లో నాలుగు వేల టన్నుల బరువున్న ఆరు వేల బాంబులను గాజాపై జారవిడిచినట్లు తెలిపింది. అయితే ఈ క్రమంలో ఇజ్రాయిల్‌ వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ఉపయోగిస్తోందని న్యూయార్క్‌కు చెందిన హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ అనే సంస్థ ఆరోపించింది. ఇవి పౌరులపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 10న లెబనాన్‌పై, 11న గాజాపై దాడులకు సంబంధించిన వీడియోలను పరిశీలించామని, వాటిలో వైట్‌ పాస్ఫరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ తెలిపింది. గతంలో 2008-09లో గాజాపై ఉపయోగించిన వైట్‌ పాస్ఫరస్‌ బాంబులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామని 2013లో ఇజ్రాయిల్‌ ప్రకటించింది. తాజాగా మరోసారి ఇజ్రాయిల్‌ వీటిని గాజాపై ప్రయోగించిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.
బంకర్‌లు, భవనాలను నాశనం చేసేందుకు పాస్ఫరస్‌ బాంబులను ఉపయోగిస్తారు. అయితే, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, దీర్ఘ కాలిక రోగాలకు కారణమవుతాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వీటి వినియోగంపై ఎలాంటి నిషేధం లేకపోవడంతో కొన్ని దేశాలు ప్రత్యర్థులపై దాడులు చేసేందుకు వినియోగిస్తున్నాయి.a

Spread the love