పేప‌ర్ లీక్ దందా

Paper Leak Danda– రూ. కోట్లు దండుకుంటున్న ముఠాలు
– చట్టంలోని లొసుగులే ఆయుధం
– పదే పదే చేస్తున్న నేరస్థులతో’ పని కానిస్తున్న వైనం
బిష్ణోయ్‌ 13 సంవత్సరాల కాలంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడనీ, రాజస్థాన్‌లో 2021లో సబ్‌-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్‌ కోసం, 2022లో జూనియర్‌ ఇంజనీర్‌ల కోసం జరిగిన మరొక నియామక పరీక్ష సహా అనేక ఉన్నత స్థాయి పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌లకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బిష్ణోయ్‌ నేతృత్వంలోని ముఠాలు ప్రశ్నా పత్రాలను సెట్‌ చేసే అధికారులతో కలిసి పనిచేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద సూపర్‌వైజర్లు, సూపరింటెండెంట్‌లను నియమించటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ప్రింటింగ్‌ ప్రెస్‌లు, కొరియర్‌ కంపెనీలతో పాటు పేపర్‌లను రవాణా చేయటానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. కోచింగ్‌ సెంటర్లు కూడా ఇందులో కీలకంగా వ్యవహరిస్తాయి.
న్యూఢిల్లీ:
భారత్‌లో ‘పేపర్‌ లీక్‌’ ఒక తీవ్రమైన సమస్యగా పరిణమించింది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. పేపర్‌ లీక్‌లు మాత్రం ఆగటం లేదు. దీంతో పోటీ పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇది పెద్ద ఆటంకంగా మారింది. అయితే, ఈ పేపర్‌ లీక్‌లు అనేవి ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత వైఖరికి నిదర్శనమని మేధావులు, నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పేపర్‌ లీక్‌ పరిశ్రమ నడుస్తున్నదనీ, ఇది కోట్లాది రూపాయల వ్యాపారాన్ని జరుపుతున్నదని చెప్తున్నారు. పేపర్‌ లీక్‌లు వంటి నేరాల్లో ఆరితేరిన ‘పునరావృతి నేరస్థుల’ను వాడుకొని పేపర్‌ లీక్‌ పరిశ్రమ తాను అనుకున్న పనిని సులవుగా కానిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఉదాహరణకు.. జగదీష్‌ బిష్ణోయ్‌ అలియాస్‌ ‘గురు’ మార్చి 2008లో రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన ఆ సంవత్సరం జులైలో.. ‘డమ్మీ అభ్యర్థి’గా కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన ప్రశ్నాపత్రాలను ‘లీక్‌’ చేసినందుకు అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న బిష్ణోయ్‌కు అటువంటి 12 కేసుల్లో ప్రమేయం ఉన్నందున 2020లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.
రాజస్థాన్‌ పోలీస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) వర్గాల సమాచారం ప్రకారం..”2010లో ఆయన (బిష్ణోయ్‌) సస్పెన్షన్‌ నుంచి.. ప్రొఫెషనల్‌ పేపర్‌ లీక్‌ మాఫియాగా మారాడు. ఆయన ఇతర సారూప్య అంశాల సహాయంతో వేగంగా అభివృద్ధి చెందాడు” అని రాజస్థాన్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. బిష్ణోయ్‌కి వ్యతిరేకంగా ఉన్న ఏ కేసులోనూ ఇంకా దోషిగా నిర్ధారించబడనప్పటికీ, పేపర్‌ లీకేజీకి సంబంధించిన అనేక కేసుల్లో బుక్‌ చేయబడినప్పటికీ, కొన్నేండ్ల పాటు వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకోవచ్చో అతనిలాంటి వారు చూపించారు. ఇలాంటివి పలు ముఠాలు దేశంలో నడుస్తున్నాయి. అయితే, తప్పులు చేశామన్న పశ్చాత్తాపం వారిలో ఉండదనీ, వారికి పరీక్ష పేపర్‌ల లీక్‌ల ఘటనల తర్వాత కూడా బెయిల్‌లు లభిస్తుండటం గమనార్హం. యూపీకి చెందిన ఒక సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ”వారు ప్రతిసారీ.. ఎక్కువ శిక్షార్హతతో బయటకు వచ్చినప్పుడు బెయిల్‌ పొందగలుగుతారు. విచారణ పూర్తయిన కేసుల్లో కూడా కఠిన సెక్షన్లు విధించి విచారణ దశకు చేరినా.. కేసు నత్తనడకన సాగుతున్నది” అని చెప్పారు. పోలీసుల జరిపే గాలి దర్యాప్తులతో ఇలాంటి కేసుల్లో శిక్షలు పడటం కూడా కష్టమేనని నిపుణులు అంటున్నారు.
రష్యన్‌ హ్యాకర్లతో కలిసి ఐఐటీ-జేఈఈ, జీమ్యాట్‌ పేపర్‌ లీక్‌ రాకెట్‌ను నడుపుతున్నారనే ఆరోపణలపై 2022లో ఢిల్లీ పోలీసు సైబర్‌ సెల్‌ రాజ్‌ టియోటియాను అరెస్టు చేసింది. ఈ ముఠా ప్రశ్నాపత్రాలను విక్రయించటం ద్వారా దాదాపు రూ. 60 కోట్లను ఆర్జించిందని సమాచారం. అంతేకాకుండా, 2021 జేఈఈ మెయిన్స్‌ లీక్‌ కేసుపై విచారణలో నిందితుడికి 820 మంది అభ్యర్థులు సుమారు రూ. 15 లక్షలు చెల్లించినట్లు తేలింది.
డిసెంబరు 2022లో సీనియర్‌ ఉపాధ్యాయుల కోసం రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఆర్‌పీఎస్‌సీ) నిర్వహించిన పోటీ పరీక్షలో పేపర్‌ లీక్‌ జరిగింది. ఈ కేసులో కీలక నిందితులకు కమీషన్లు కాకుండా ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలకు ప్రశ్నాపత్రాలను విక్రయించినట్టు గుర్తించారు. పేపర్‌ లీక్‌ చేసేందుకు ఆర్‌పీఎస్‌సీ సభ్యుడు బాబు లాల్‌ కటారా రూ.60 లక్షలు చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో వెలుగులోకి వచ్చిన నీట్‌-యూజీ 2024 ‘పేపర్‌ లీక్‌’ కేసులో, పరీక్షకు ముందు రోజు రాత్రి ప్రశ్నపత్రం కోసం కొందరు ఆశావహులు రూ. 30 లక్షలు చెల్లించినట్టు సమాచారం. ”కొన్ని పేపర్‌ లీక్‌లు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయి. పరీక్షలు రద్దు చేయబడ్డాయి కానీ అన్ని స్థాయిలలో లీక్‌లు జరుగుతున్నాయి. అన్నీ వార్తల్లోకి రావు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని రాజస్థాన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి చెప్పారు.
సంజీవ్‌ కుమార్‌ అలియాస్‌ ‘ముఖియా’పై 12 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి, వాటిలో నీట్‌-యూజీ 2024 ‘పేపర్‌ లీక్‌’ కేసుతో సహా ఐదు పేపర్‌ లీకేజీ కేసులున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జార్ఖండ్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (జేఎస్‌ఎస్‌సీ) పేపర్‌ లీక్‌ కేసుతో పాటు బీహార్‌లోని మరో రెండు కేసులకు సంబంధించి కూడా ఆయనపై కేసులున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీపీఎస్‌సీ) కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌పై విచారణ సందర్భంగా సంజీవ్‌ కుమార్‌ సహాయకులలో ఒకరైన శుభం మండల్‌ పేరు కూడా బయటపడింది. ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌లో 60,000 ఖాళీలను భర్తీ చేయడానికి 47 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 2021 ఐఐటీ-జేఈఈ పేపర్‌ లీక్‌ కేసు వెనుక ‘మాస్టర్‌ మైండ్‌’గా సీబీఐ పేర్కొన్న వినరు దహియా ఢిల్లీలో కన్సల్టెన్సీ సంస్థను నడుపుతున్నాడు. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ)కి హాజరయ్యే అభ్యర్థులకు నకిలీ ప్రశ్నపత్రాలు ఇచ్చి దోచుకోవడానికి ప్రయత్నించినందుకు ఆయన, ఆయన సహచరుడిని ఈ ఏడాది జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన గొడవతో దాహియా దాదాపు 40 మంది విద్యార్థులను పిలిచి ఒక్కో పేపర్‌ను రూ.20 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు అడ్వాన్స్‌గా రూ.4-6 లక్షలు కూడా తీసుకున్నారు. దాహియాపై యూపీలో మరో రెండు పేపర్‌ లీక్‌ కేసులు కూడా నమోదయ్యాయి.
రాజస్థాన్‌లోని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ భువనేష్‌ శర్మ మాట్లాడుతూ.. ఐపీసీలోని సెక్షన్‌ 420 ప్రకారం శిక్ష ఏడేండ్లు కాబట్టి, బెయిల్‌ షరతులు సులువుగా ఉన్నాయనీ, నిందితుడు పోలీస్‌ స్టేషన్‌ నుంచి బెయిల్‌ పొందగలడని తెలిపారు. పేపర్‌ లీక్‌లో దోషిగా తేలిన వ్యక్తికి గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా రాజస్థాన్‌లో ఉన్నటువంటి చట్టాలే పరిష్కారమని శర్మ చెప్పారు. చట్టం పరిధిలో, ఈ సిండికేట్లను వ్యవస్థీకృత ముఠాలుగా పరిగణించాలని పోలీసు అధికారులు అంటున్నారు. ”ఒక నిర్దిష్ట నిందితుడు ముఠాతో సంబంధం కలిగి ఉన్నాడని నిర్ధారించగలిగిన వెంటనే.. అతని నేరం మరియు పూర్వాపరాల పరిధిలోకి వెళ్లవలసిన అవసరం లేదు. ఈ అంశాలను వ్యవస్థీకృత ముఠాలలో భాగమని రుజువు చేయడం ద్వారా వాటిని అరికట్టడానికి ఈ చట్టం ఉపయోగపడాలి” అని బీహార్‌కు చెందిన ఒక పోలీసు అధికారి అన్నారు.

Spread the love