నేనూ ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేస్తా.. పారా రెజ్లర్‌ వీరేందర్‌ సింగ్‌

నవతెలంగాణ ఢిల్లీ: లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌కు విధేయుడైన సంజయ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రెజ్లింగ్‌లో మరోసారి వివాదం మొదలైంది. ఆయన ఎన్నికను నిరసిస్తూ ఇప్పటికే రెజ్లర్‌ (Wrestler) సాక్షి మలిక్‌ (Sakshee Malikkh) రిటైర్మెంట్‌ ప్రకటించగా.. మరో కుస్తీయోధుడు బజ్‌రంగ్‌ పునియా (Bajrang Punia) తన ‘పద్మశ్రీ (Padma Shri Award)’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రముఖ పారా రెజ్లర్‌ వీరేందర్‌ సింగ్‌ (Virender Singh) కూడా వీరికి మద్దతు ప్రకటించాడు. తన ‘పద్మశ్రీ’ని కూడా వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వెల్లడించాడు. ‘‘ఈ దేశ పుత్రిక, నా సోదరి (సాక్షి మలిక్‌) కోసం నేను కూడా నా పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తాను. సాక్షి మలిక్‌ను చూసి నేను గర్వపడుతున్నా. దేశంలోని ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు కూడా దీనిపై (రెజ్లింగ్‌ వివాదాన్ని ఉద్దేశిస్తూ) తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నా’’ అని వీరేందర్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీరేందర్‌కు 2021లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆ ఏడాది నవంబరులో అవార్డును అందుకున్న ఈ రెజ్లర్‌.. మరుసటి రోజే పారా అథ్లెట్లకు న్యాయం చేయాలంటూ హరియాణా సీఎం ఇంటి ముందు అవార్డులతో నిరసన చేసి వార్తల్లో నిలిచారు.

Spread the love