పార్లమెంటు షురూ..

పార్లమెంటు షురూ..– లోక్‌సభలో న్యాయవాదుల బిల్లు
– రాజ్యసభలో పోస్టాఫీసు బిల్లు ఆమోదం
– లోక్‌సభలో ప్రవేశపెట్టిన తెలంగాణ గిరిజన యూనివర్సిటీ బిల్లు
– ఉత్తరాఖండ్‌ సొరంగం సంఘటనపై న్యాయ విచారణ జరపాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో పోస్టాఫీసు బిల్లు, లోక్‌సభలో న్యాయవాదులు సవరణ బిల్లు ఆమోదం పొందాయి. రాజ్యసభలో పోస్టాఫీసు సవరణ బిల్లును కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రవేశపెట్టారు. దేశంలోని తపాలా కార్యాలయానికి సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడం, సవరించడం, దానితో అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పోస్టాఫీసుల ప్రయివేటీకరణ అంశాన్ని ప్రభుత్వం చేపట్టే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష ఎంపీలు పోస్టాఫీసుల ప్రయివేటీకరణ అంశంపై ఆందోళన వ్యక్తంచేశారు.
మరోవైపు న్యాయవాద వృత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు. న్యాయవాద వృత్తిని ఒకే చట్టం ద్వారా క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. దేశంలోని న్యాయస్థానాల్లో దూషణల పాత్ర ఉండకూడదని చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు సవరణల్లోని లోపాలను ఎత్తి చూపారు.
లోక్‌సభలో తెలంగాణ గిరిజన యూనివర్సిటీ బిల్లు
తెలంగాణలోని సమ్మక్క, సారక్క సెంట్రల్‌ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన సెంట్రల్‌ యూనివర్సిటీ సవరణ బిల్లును కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వరంగల్‌ జిల్లా ములుగులో సెంట్రల్‌ ట్రైబుల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. గిరిజన యూనివర్సిటీని రూ.889.07 కోట్లతో రెండు దశల్లో ఏడేండ్లలో నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటు రాబోయే కాలంలో ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చగలదని అన్నారు. అలాగే ఉన్నత విద్య నాణ్యతను పెంచుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలను సులభతరం చేస్తుందనీ, ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలోని గిరిజన జనాభాకు గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు, సాంకేతికతలో పురోగతిలో బోధన, పరిశోధన సౌకర్యాలను అందించడంతో అధునాతన జ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తుందని అన్నారు.
శాస్త్రవేత్త స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వాలి
దివంగత ఎంఎస్‌ స్వామినాథన్‌ అంత్యక్రియలకు కేంద్రప్రభుత్వ ప్రతినిధి ఎవరూ హాజరు కాకపోవటం ఆయనను అగౌరవ పరచటమేనని కాంగ్రెస్‌ ఎంపీ కె సురేష్‌ వాపోయారు. ఆయనను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో స్వామినాథన్‌ జీవిత పరిమాణ విగ్రహాన్ని, సెంట్రల్‌ హాల్‌లో శాస్త్రవేత్త చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉత్తరాఖండ్‌ సొరంగం సంఘటనపై న్యాయ విచారణ జరపాలి : సీపీఐ(ఎం)
ఉత్తరాఖండ్‌ సొరంగం సంఘటనపై న్యాయ విచారణ జరపాలని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో జీరో అవర్‌లో సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్‌ ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిపోయిన అంశాన్ని లేవనెత్తారు. సంబంధిత సంస్థ భద్రతా చర్యలు అమలు చేయలేదని ఆరోపిస్తూ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన చాలా బాధాకరమనీ, టన్నెలింగ్‌ కంపెనీ అన్ని భద్రతా చర్యలు, నియమాలు, నిబంధనలను ఉల్లంఘించిందని విమర్శించారు. పారదర్శక, న్యాయమైన విచారణ చాలా అవసరమని అన్నారు. సిల్క్యారా ఒక్కటే ఘటన కాదని, ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా జరిగాయని తెలిపారు.
వాయు కాలుష్యం కారణంగా 21 లక్షల మంది మరణిస్తున్నారు
ఆప్‌కి చెందిన సంత్‌ బల్బీర్‌ సింగ్‌ వాయు కాలుష్య సమస్యను లేవనెత్తారు. వాయు కాలుష్యం కారణంగా ఏటా దాదాపు 21 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. ఏడాదిలో ఢిల్లీలో ఒక రోజు, ముంబయిలో ఐదు రోజులు, చెన్నైలో 15 రోజులు మాత్రమే గాలి శుభ్రంగా ఉందని సింగ్‌ పేర్కొన్నారు. వాయు కాలుష్యం గురించి చర్చలు వచ్చినప్పుడల్లా, పంజాబ్‌ రైతులు పొట్టను తగులబెట్టడమే దీనికి కారణమని అంటున్నారని ఆయన అన్నారు. పంజాబ్‌లోని ఏ రైతు కూడా పంట వ్యర్థాలను కాల్చడం ఇష్టం లేదని, తాజాగా విత్తే ముందు పొలాన్ని శుభ్రం చేయడానికి తమ పంటను కాల్చాల్సిన అవసరం లేదని రైతులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.

Spread the love