ప్రశ్నార్థకంగా పార్లమెంట్‌?

Parliament in question?– కమిటీకి ఒక్క బిల్లూ పంపలేదు
– సభ్యులను మూకుమ్మడిగా గెంటేశారుొ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ప్రస్తావనే లేదు
–  ఇదీ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తీరు
17వ లోక్‌సభ పదవీకాలం ముగియబోతోంది. మరో సమావేశం మాత్రమే జరగాల్సి ఉంది. లోక్‌సభ చరిత్రలోనే తొలిసారిగా డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరపకుండానే ఇప్పటి వరకూ కార్యకలాపాలు నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా లోక్‌సభ ఉప సభాపతిని ఎన్నుకోవాలని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ పాలక పక్షం దానిని పట్టించుకోలేదు. పైగా పాత పార్లమెంట్‌ సభ్యులకు సరిపోవటం లేదని, భద్రతాపరంగా ఉపయోగపడదని మోడీ సర్కార్‌ చెప్పుకొచ్చింది. కొత్త పార్లమెంట్‌ కడితే సభ్యులకు సౌకర్యంగా, భద్రతగా ఉంటుందని కోట్లు ఖర్చుపెట్టారు. ఇటీవల బయటపడ్డ భద్రత డొల్లతనాన్ని ప్రశ్నించినందుకు…ఏకంగా ఉభయసభల నుంచి 146 మంది ఎంపీలను మూకుమ్మడిగా గెంటేశారు. ప్రతిపక్షం లేని సమయం చూసి వివాదాస్పద బిల్లులన్నిటినీ ఏకపక్షంగా ఆమోదించుకున్నారు. బిల్లులను కమిటీల పరిశీలనకు పంపడమనే నియమాన్నే మరిచారు. పార్లమెంట్‌ ప్రతిష్టను, దానిపై ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రశ్నార్థకంగా మార్చారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 4 నుంచి 21వ తేదీ వరకూ జరిగాయి. షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ తన నిర్థారిత సమయంలో 74 శాతం, రాజ్యసభ 81శాతం పనిచేశాయి. ఈ సమావేశాలలో 10 బిల్లులను ప్రవేశపెట్టారు. 17 బిల్లులకు ఆమోదం లభించింది. ఈ నెల 13న పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. భద్రతా వైఫల్యం కారణంగా పార్లమెంట్‌ కార్యకలాపాలకు ఆంతరాయం ఏర్పడింది. ఘటనపై స్పందించాలంటూ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ఆ రోజు 20 శాతం మంది సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. లోక్‌సభ నుండి ఒకే రోజు ఇంతమంది సభ్యులను సస్పెండ్‌ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకూ లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. లోక్‌సభ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ సమావేశాలలోనే దుష్ప్రవర్తన కారణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహూవా మొయిత్రా బహిష్కరణకు గురయ్యారు. గతంలో పార్లమెంటులో మూడుసార్లు ఎంపీలపై బహిష్కరణ వేటు పడింది. 2005లో 11 మందిని బహిష్కరించారు. ప్రశ్నలు వేసినందుకు ప్రతిగా డబ్బు తీసుకున్నారంటూ వారిపై ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు 1976, 1978 సంవత్సరాలలో ఒక్కో సభ్యుడు బహిష్కరణకు గురయ్యారు. ఈ సమావేశాలలో సభలో 10 బిల్లులను ప్రవేశపెట్టగా అవన్నీ ఆమోదం పొందాయి. గత సమావేశాలలో పెండింగులో ఉన్న మరో ఏడు బిల్లులకు కూడా ఆమోదం లభించింది. ప్రవేశపెట్టిన మూడు రోజులలోనే టెలికమ్యూనికేషన్‌ బిల్లును ఆమోదించారు. దీనిపై లోక్‌సభలో కేవలం గంటా నాలుగు నిమిషాలు, రాజ్యసభలో గంటా పదకొండు నిమిషాల పాటు మాత్రమే చర్చ జరిగింది. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో తీసుకొచ్చిన మూడు బిల్ల్లులపై కూడా సభ చర్చించి ఆమోదించింది. ఈ మూడు బిల్లులపై లోక్‌సభలో 9.34 గంటలు, రాజ్యసభలో 6.08 గంటల చర్చ జరిగింది. లోక్‌సభలో 34 మంది చర్చలో పాల్గొనగా వారిలో 25 మంది బీజేపీ వారే. రాజ్యసభలో 40 మంది చర్చలో భాగస్వాములు కాగా వారిలో 30 మంది బీజేపీకి చెందిన సభ్యులే.
శీతాకాల సమావేశాలలో ఒక్క బిల్లును కూడా పరిశీలన నిమిత్తం కమిటీలకు నివేదించకపోవడం గమనార్హం. 15వ లోక్‌సభలో 71% బిల్లులను కమిటీల పరిశీలనకు పంపగా 16వ లోక్‌సభలో అది 16%కి పడిపోయింది. ఇక ప్రశ్నోత్తరాల విషయానికి వస్తే సస్పెన్షన్‌కు గురైన సభ్యులు సభలో ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నలన్నింటినీ జాబితా నుండి తొలగించారు. 14 మంది సభ్యులు సస్పెన్షకు గురైన 14వ తేదీ నుండి లోక్‌సభలో 12%, రాజ్యసభలో 13 శాతం ప్రశ్నలు రద్దయ్యాయి. రాజ్యసభలో రెండు రోజులు, లోక్‌సభలో మూడు రోజులు సభ్యుల ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు ఇవ్వలేదు. మొత్తంమీద ప్రశ్నోత్తరాల సమయం లోక్‌సభలో 53 శాతం, రాజ్యసభలో 72 శాతం పనిచేసింది. ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ జరిగింది. వార్షిక బడ్జెట్‌లో ఒక్క శాతం పెంపుదలతో ప్రవేశపెట్టిన అనుబంధ పద్దుకు కూడా ఉభయసభలు ఆమోదం తెలిపాయి.

Spread the love