పార్లమెంట్‌ టు ఈడీ

– ప్రతిపక్షాల మార్చ్‌… అడ్డుకున్న పోలీసులు
– పార్లమెంటులో మూడో రోజూ అదే తీరు
– అధికార, ప్రతిపక్షాల ఆందోళనతో ప్రతిష్టంభన
న్యూఢిల్లీ : అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తూ, అధికార బీజేపీ రాజకీయ లక్ష్యాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ 18 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి ప్రదర్శన చేపట్టారు. ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన ఈ ర్యాలీని ఢిల్లీ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. పార్లమెంట్‌ నుంచి బయటకు వచ్చిన నేతలను విజరు చౌక్‌ వద్ద భారీగా ఏర్పాటుచేసిన బారికేడ్లతో నిలువరించారు. 144వ సెక్షన్‌ అమలులో ఉందనీ, ఇక్కడ ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదనీ, ప్రదర్శన ముందుకు కదలడానికి వీలులేదంటూ అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసుల భారీస్థాయి బలగాల మోహరింపుతో ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘అదానీ అంశంపై ఈడీ డైరెక్టర్‌ను కలిసేందుకు మేం బయలుదేరాం. కానీ మేం వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. ఇది చాలా పెద్ద కుంభకోణం. ఆ గ్రూప్‌లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల పెట్టుబడులున్నాయి. ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుకు ప్రభుత్వమే ఒక వ్యక్తికి డబ్బు ఇస్తున్నది. గతంలో కొద్దిపాటి వ్యాపారాలు ఉన్న వ్యక్తి అనూహ్యంగా రూ.13 లక్షల కోట్లకు ఎలా ఎగబాకాడు? ఇది ఎలా సాధ్యం? ఎవరు డబ్బు ఇస్తున్నారు? మోడీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష నేతల గళాన్ని అణచివేస్తున్నారు’ అని విమర్శలు గుప్పించారు. తాము 200 మంది ఎంపీలం ఉన్నామనీ, కానీ పోలీసులు 2,000 మంది ఉన్నారని విమర్శించారు. తమ గొంతును నొక్కేస్తున్నారనీ, మళ్లీ వారే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాగే కేంబ్రిడ్జిలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్‌ నుంచి క్షమాపణ డిమాండ్‌ చేస్తున్నవారు, గతంలో విదేశీ గడ్డపై దేశ ప్రజల గురించి మోడీ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలన్నారు. ‘అదానీ అంశం’పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తును ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని కాంగ్రెస్‌ లోక్‌సభ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. అయితే బీజేపీకి జేపీసీ అక్కర్లేదని, ఎందుకంటే బీజేపీ అవినీతి బయటపడుతుందని పేర్కొన్నారు. అలాగే బీజేపీ అసలు రూపం కూడా ప్రజలకు తెలుస్తుందనీ, ప్రతిపక్షంలో ఉన్నంత వరకు జేపీసీ కావాలని డిమాండ్‌ చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు భయపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రతిష్టంభన
పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో వరుసగా మూడో రోజూ కూడా అదే తీరు కొనసాగింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో పార్లమెంట్‌ ఉభయ సభలు స్తంభించాయి. అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేయగా, రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ ఎంపీలు.. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు చేబూని ఆందోళనకు దిగారు. అదానీ అంశంపై విచారణకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నినాదాలు హోరెత్తించారు. దానికి పోటీగా అధికార బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. నినాదాలతో గందరగోళం సృష్టించారు. లండన్‌లో దేశం పరువుతీసే వ్యాఖ్యలు చేసిన రాహుల్‌గాంధీ.. సభకు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా కోరారు. అయినప్పటికీ అధికార పక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు కూడా తమ ఆందోళనను కొనసాగించారు. వెంటనే సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే తీరు కొనసాగింది.

Spread the love