– లోపభూయిష్టంగా పరీక్షల వ్యవస్థ
– విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతోంది : రాహుల్ గాంధీ
– సుపరిపాలనకు ఈ బడ్జెట్ కీలకం
– ప్రతిపక్షం సభను సాగనివ్వట్లేదు : ప్రధాని మోడీ
– తొలిరోజే వాడీవేడిగా సభ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్ దద్దరిల్లింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్‌తో పాటు యూజీసీ నెట్, సీయూ నెట్ వంటి అనేక పరీక్షల అవకతవకలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇవ్వగా సంతృప్తి చెందని ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. సోమవారం లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీట్ 2024 ప్రశ్నాపత్రాల లీకేజీ మన విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల్లో తీవ్ర సమస్యని, నీట్ ఒక్కటే కాక అన్ని కీలక పరీక్షల్లో ఇదే తంతు జరుగుతోందని విమర్శించారు. పరీక్షా విధానంలో తప్పులు జరిగాయని అన్నారు. విద్యాశాఖ మంత్రి సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పనితీరు సమీక్షించుకోవడం మాని విమర్శిస్తే నిందిస్తున్నారని అన్నారు. దేశంలోని విద్యార్థులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. మన పరీక్షల వ్యవస్ధ లోపభూయిష్టంగా తయారైందనే ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొందని అన్నారు. విద్యా వ్యవస్ధ అంతా మోసపూరితమని లక్షలాది విద్యార్ధులు భావిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులు డబ్బు చెల్లించి దేశ పరీక్షల వ్యవస్ధను కొనుగోలు చేయవచ్చని విద్యార్ధులు నమ్ముతున్నారని చెప్పారు. విద్యార్ధుల్లో నెలకొన్న భావనే విపక్షం కూడా కలిగి ఉందని రాహుల్ వివరించారు. ఈ వ్యవహారంపై రోజంతా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఈ అంశంపై తమకు పూర్తి అవగాహన ఉందని, అనవసరంగా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, తనకు సభలో రాహుల్ సర్టిఫికెట్ అవసరం లేదని, ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రకటన దురదృష్టకరమని తెలిపారు. రిమోట్‌గా ప్రభుత్వాన్ని నడిపే వారు ప్రకటనలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవస్థను మెరుగుపరచడానికి సూచనలు ఇస్తే బాగుంటుందన్నారు. తన పర్యవేక్షణలో ఎక్కడా ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని తెలిపారు. గత ఏడేండ్ల కాలంలో పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవని, ఎ న్టీఏ ఇప్పటి వరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీల విషయంలో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొన్ని సెంటర్లలో 2 వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ ఏడేండ్లలో 70 సార్లు పేపర్ లీకైందని, నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ”విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి ఉండాల్సింది. ఆయన సుప్రీంకోర్టు, ప్రధాని మోడీ గురించి మాట్లాడారు. అయితే దీనిపై ఏం చేస్తున్నారో చెప్పలేకపోయారు. నీట్ చాలా గొప్పది. యువతకు సంబంధించిన ముఖ్యమైన సమస్యపై మేము ఎప్పటినుంచో పార్లమెంట్‌లో చర్చించాలని కోరుతున్నాం. ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటాం” అని అన్నారు.